చిరు నోట.. జారు మిఠాయా

రీఎంట్రీలో వరుసగా సీరియస్ సినిమాలే చేస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఎట్టకేలకు పూర్తి స్థాయి ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా గురువారం రిలీజైన ‘వాల్తేరు వీరయ్య’లో చిరు తన వింటేజ్ యాంటిక్స్‌తో అభిమానులను అలరించడానికి ప్రయత్నించాడు.

ముఠా మేస్త్రి, అన్నయ్య, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలను గుర్తు చేస్తూ.. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో చిరు పూర్తి స్థాయిలో మెప్పించాడని చెప్పలేం. అలా అని ఆయన నిరాశపరచనూ లేదు.

కాగా వింటేజ్ చిరును గుర్తు చేయిస్తూనే.. ఆ పాత్రను ట్రెండీగా మార్చడానికి కూడా బాబీ అండ్ టీం కాస్త ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత ట్రెండుకు తగ్గ డైలాగులు చిరుతో చెప్పించారు. ఆ డైలాగులన్నీ ఒకెత్తయితే.. చిరు ఒక ట్రెండింగ్ పాటను ఈ సినిమాలో పాడడం విశేషం.

జంబలకిడి జారుమిఠాయా పాట.. సోషల్ మీడియాను కొన్ని నెలలుగా ఎలా ఊపేస్తోందో తెలిసిందే. మంచు విష్ణు సినిమా ‘జిన్నా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తమ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు పల్లె పడుచులను తీసుకొచ్చి అక్కడ ప్రసిద్ధి చెందిన రెండు పల్లె జానపదాలను పాడించింది మోహన్ బాబు కుటుంబం. ఐతే ఆ పాటలు తర్వాత ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయాయి.

ముఖ్యంగా ‘జంబలకిడి జారుమిఠాయా’ పాట సోషల్ మీడియాలో మామూలుగా ట్రెండవ్వలేదు. టీవీ షోల్లో, థియేటర్లలో, సోషల్ మీడియాలో.. ఎక్కడ పడితే అక్కడ జనాలు ఈ పాటను కామెడీగా వాడేస్తున్నారు. చివరికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ చిత్రంలో స్వయంగా చిరు నోట ఈ పాట రావడం విశేషం.

అందరూ తన శత్రువుగా భావించే తన తమ్ముడు (రవితేజ) తనను స్వయంగా కార్లో తీసుకొచ్చి తన పేటలో తీసుకొచ్చినపుడు సంతోషం పట్టలేక నన్ను కార్లో దించాడు చూడు కార్లో దించాడు చూడు జంబలకిడి జారుమిఠాయా అంటూ పేరడీ పాట అందుకున్నాడు చిరు. థియేటర్లో ఈ పాటకు మంచి రెస్పాన్సే వచ్చింది. కానీ చిరు ఇలా ‘మంచు’ వారిని ట్రోల్ చేయడానికి ఉపయోగించుకున్న పాటను పాడడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.