సంక్రాంతి బాక్సాఫీస్ ఆట షురూ

కొత్త ఏడాదిలో తొలి బాక్సాఫీస్ సంరంభం మొదలైపోయింది. అనూహ్య సంఘటనలు, డబ్బింగ్ సినిమాల పంచాయితీలు, థియేటర్ల పంపకాలు, విడుదల తేదీల్లో అనుకోని మార్పులు వెరసి టాలీవుడ్ బిగ్గెస్ట్ వార్ కి రంగం సిద్ధమైపోయింది. ఊహించని విధంగా దీనికి అజిత్ సినిమా తెగింపుతో బోణీ జరిగింది. తమిళనాడులో అర్ధరాత్రి నుంచే షోలు మొదలుకాగా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఉదయం 7 నుంచే ప్రీమియర్లు స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి టాక్ డీసెంట్ గానే ఉంది కానీ స్పష్టమైన అవగాహన రావాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే. మరోవైపు వరిసుకి మీడియాతో కొందరు అభిమానులకు ముందు రోజు సాయంత్రమే షోలు ప్రదర్శించారు.

తెలుగు వెర్షన్ 14 కాబట్టి ఇంకో మూడు రోజులు ఎదురు చూపులు తప్పవు. అసలైన జాతర రేపు వీరసింహారెడ్డితో స్టార్ట్ అవుతుంది. బాలయ్య ఊర మాస్ ఫ్యాక్షన్ కోసం అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు తెల్లవారుఝామున 4 గంటల షోలకు అనుమతి ఇవ్వడంతో సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓ వారం పాటు టికెట్లు దొరకడం అనుమానమే. ఏపీలో కేవలం పాతిక రూపాయలకే పెంపు ఇవ్వడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు నిరాశ కలిగించింది.

ఇక వాల్తేరు వీరయ్యకు సైతం పాజిటివ్ బజ్ నడుస్తోంది. బాస్ పార్టీ సాంగ్ హిట్ అయ్యాక ట్రైలర్ కు ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూసి టీమ్ నమ్మకంగా ఉంది. రికార్డుల విషయంలో మెగాస్టార్ ముద్ర ఈసారి ఖచ్చితంగా ఉంటుందని బాబీ గట్టి కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ఒకప్పుడు సహచరుడిగా ఉన్న తన సీనియర్ గోపీచంద్ మలినేనితో పోటీ పడాల్సి రావడం విశేషం. చిరు బాలయ్య ఇద్దరివీ ఒక బ్యానర్ సినిమాలు కావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లల వద్ద కోలాహలం, టికెట్ ల కోసం తొక్కిడి, ఫ్యామిలీలు గుంపుగా కలిసి వెళ్లడం లాంటివి చూడబోతున్నాం. 14న చివర్లో వచ్చే కళ్యాణం కమనీయం ఏమైనా స్వీట్ షాక్ ఇస్తుందేమో చూడాలి మరి.