ఫ్యామిలీ కోసం ఫార్ములా వారసుడు

సంక్రాంతి థియేటర్ల గొడవలో కేంద్ర బిందువుగా ఉన్న వారసుడు మీద తెలుగులో చెప్పుకోదగ్గ బజ్ లేకపోయినా విడుదల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ భారీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ వెర్షన్ కు గ్రాండ్ ఆడియో ఈవెంట్ లాంటివి చేశారు కానీ ఎటొచ్చి తెలుగు వరకు పెద్దగా కదలిక కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ డ్రామా అనే హింట్ తప్ప కథ గురించి చెప్పుకోదగ్గ లీకులైతే రాలేదు. అందుకే అసలు స్టోరీలో మ్యాటర్ ఏముందో తెలియాలంటే ఇదొక్కటే మార్గం కావడంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.

చెప్పిన టైంకే తమిళ వెర్షన్ రిలీజ్ చేయగా తెలుగు ట్రైలర్ రెండు గంటలు ఆలస్యంగా ప్లాన్ చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలతో సినిమాలో ఏముందో క్లియర్ గా చెప్పేశారు. అనగనగా ఒక బిజినెస్ మెన్(శరత్ కుమార్). ఇద్దరు కొడుకులతో (శ్రీకాంత్ – శ్యామ్) వ్యాపారాన్ని నడిపిస్తూ చీకు చింతా లేకుండా జీవిస్తుంటాడు. అయితే మరో వారసుడు(విజయ్)కూడా ఉంటాడు. శత్రువు (ప్రకాష్ రాజ్) వల్ల తమ కంపనీతో పాటు ఫ్యామిలీ కూడా ఇబ్బందుల్లో పడటంతో స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఛాలెంజ్ విసిరి తాడోపేడో తేల్చుకుంటాడు. యథావిధిగా ఒక లవర్(రష్మిక మందన్న) ఉంటుంది.

భారీతనానికి లోటు లేకపోయినా దర్శకుడు వంశీ పైడిపల్లి రిస్క్ లేకుండా రెగ్యులర్ ఫ్యామిలీ ఎమోషనల్ కం యాక్షన్ డ్రామాని ఎంచుకున్నాడు. అత్తారింటిది దారేది, అల వైకుంఠపురములో త్రివిక్రమ్ స్టైల్ తో పాటు తనే తీసిన మహర్షి టెంప్లేట్ ని కూడా ఇందులో వాడాడు. తండ్రితో అన్నదమ్ములు విడిపోవడం, తల్లి బాధపడటం, చిన్నవాడు బాధ్యతలు భుజాన వేసుకుని విలన్ తో ఫైట్ చేస్తూనే వీళ్ళను కలపడం ఇదంతా వెంకటేష్ లక్ష్మి టైపులో సాగింది. మొత్తంగా చెప్పాలంటే మరీ కొత్తగా లేకపోయినా విజయ్ ఎనర్జీ స్టైలిష్ మేకింగ్ తో వారసుడు ఫ్యామిలీ జనాన్ని ఎలా మెప్పించబోతున్నాడో చూడాలి