ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అయితే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తమకు ఇష్టం వచ్చిన తినుబండారాలను తీసుకెళ్లవచ్చు. దాన్ని థియేటర్ల యాజమాన్యాలు అడ్డుకోజాలవు. ఐతే ఈ నిబంధనను పాటించే థియేటర్లు తక్కువ. చాలా వరకు బయటి తినుబండారాలను థియేటర్ల యాజమాన్యాలు అనుమతించవు. ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా లేదా.. బయట ఏమైనా కొని తెచ్చుకున్నా వాటిని తీసి కౌంటర్లలో పెట్టి తర్వాత తీసుకెళ్లమంటారు.
ఐతే ఇప్పటిదాకా నిబంధనల గురించి అవగాహన ఉన్న వాళ్లు తమ వెంట నచ్చిన తినుబండారాలను థియేటర్లలోకి తీసుకెళ్లేవాళ్లు. ఈ విషయమై తరచుగా థియేటర్ల దగ్గర ఘర్షణ చోటు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యాజామాన్యాల తరఫున వేసిన ఓ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
థియేటర్లలోకి ప్రేక్షకులు బయటి తినుబండారాలను తీసుకెళ్లడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చింది. వాటిని నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని తాజాగా తీర్పు వెలువరించింది. థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లేది ఎంటర్టైన్మెంట్ కోసమని.. అలాంటి చోట బయటి ఫుడ్ తీసుకెళ్తే నియంత్రించే అధికారం యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. లోపల తినుబండారాలు నచ్చకుంటే వాటిని కొనకుండా మిన్నకుండే అవకాశం ప్రేక్షకులకు ఉంది కదా అని వ్యాఖ్యానించింది.
మరోవైపు థియేటర్లలో శుభ్రమైన మంచి నీరు ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. చిన్న పిల్లలకు అవసరమైన మేర తల్లిదండ్రులు ఫుడ్ తీసుకెళ్లేందుకు థియేటర్ల యాజమాన్యాలు అనుమతించాల్సిందే అని పేర్కొంది. ఈ తీర్పు పట్ల థియేటర్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.