చిరు దూసుకెళ్తున్నాడు.. బాలయ్య లేవాలి

టాలీవుడ్లో సంక్రాంతికి పలుమార్లు పోటీ పడ్డారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. కొన్నిసార్లు చిరంజీవి పైచేయి సాధిస్తే.. కొన్నిసార్లు బాలయ్యదే ఆధిపత్యం అయింది. చివరగా ఆరేళ్ల కిందట వీరి మధ్య పోరు సంక్రాంతి బాక్సాఫీస్ వార్ చూశాం. అప్పుడు బాలయ్య సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కే మెరుగైన టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’నే పైచేయి సాధించింది.

మళ్లీ 2023 సంక్రాంతికి వీరి సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఢీకొట్టబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలనూ నిర్మించింది మైత్రీ మూవీ మేకర్సే. దీంతో ఏ సినిమాను వాళ్లు ఎలా ప్రమోట్ చేస్తారు.. దేనికి ఎక్కువ హైప్ తీసుకొస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఒక దశ వరకు బాలయ్య సినిమాకే బజ్ కనిపించింది. చిరు చిత్రం వెనుకబడ్డట్లు కనిపించింది. కానీ గత రెండు మూడు రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి.

‘వాల్తేరు వీరయ్య’ ఒక్కసారిగా దూసుకెళ్లిపోయాడు. వీరయ్యా వీరయ్యా అంటూ సాగిన టైటిల్ సాంగ్ మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక నెవర్ బిఫోర్ అన్న స్టయిల్లో సినిమా థీమ్‌ను చాటేలా ఒక సెట్ వేసి పెద్ద స్థాయిలో సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుక చాలా బాగా సాగడంతో నిన్నట్నుంచి ‘వాల్తేరు వీరయ్య’ సందడే కనిపిస్తోంది సోషల్ మీడియాలో. దీంతో ‘వీరసింహారెడ్డి’ సౌండే వినిపించట్లేదు ఎక్కడా. ఆ సినిమాకు ఈ లెవెల్లో ప్రమోషన్లు చేస్తారా.. ఇంత హైప్ తేగలరా అన్న సందేహాలు నెలకొన్నాయి.

ఐతే చిరు సినిమాకు ఇంత హంగామా చేసి.. బాలయ్యకు తగ్గిస్తే ఆయన అభిమానులు ఊరుకోరు. కాబట్టి ఇక మైత్రీ వాళ్ల ఫోకస్ ‘వీరసింహారెడ్డి’ మీదికి మళ్లించాల్సిందే. ప్రమోషన్ల జోరు పెంచాల్సిందే. ‘అన్‌స్టాపబుల్’ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య కూడా కొంచెం వీలు చేసుకుని వచ్చే రెండు వారాలు ‘వీరసింహారెడ్డి’ ప్రమోషన్ల కోసం టైం కేటాయించాల్సిందే. లేదంటే బాక్సాఫీస్ దగ్గర చిరు ధాటిని తట్టుకోవడం కష్టమవుతుంది.