అవతార్-2 ఇంత సాధించినా..

ఈ నెల 16 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అవతార్-2’ సినిమాపై విడుదలకు ముందు ఏ స్థాయిలో హైప్ ఉందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇండియాలో మెజారిటీ స్క్రీన్లను ఆ సినిమాకే కేటాయించారు. పోటీగా ఏ సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ఐతే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అలా అని సినిమా మీద ప్రేక్షకాసక్తి తక్కువగా ఏమీ లేదు.

కథాకథనాలు ఎలా ఉన్నా సరే.. జేమ్స్ కామెరూన్ చూపించే కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించాలని థియేటర్లకు తండోపతండాలుగా వచ్చారు. బెస్ట్ స్క్రీన్లలో, త్రీడీలో సినిమాను ఆస్వాదించడానికి ఆసక్తి ప్రదర్శించారు. దీంతో వరల్డ్ వైడ్ ‘అవతార్-2’ నిలకడగా వసూళ్లు సాగిస్తూ వెళ్లింది. తొలి పన్నెండు రోజుల్లోనే ఈ చిత్రం బిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటేయడం విశేషం. మన రూపాయల్లో ఆ మొత్తం 8700 కోట్ల పైమాటే.

ఒక ఇండియన్ సినిమా ఫుల్ రన్లో వెయ్యి కోట్ల మార్కును అందుకుంటేనే అద్భుతం లాగా చెప్పుకుంటాం. అలాంటిది పన్నెండు రోజుల్లోనే 8700 కోట్లంటే చిన్న విషయం కాదు. కానీ మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద నంబరే కానీ.. ‘అవతార్-2’ స్థాయికి మాత్రం అది చిన్నదే. ఎందుకంటే ఆ సినిమా ముందున్న టార్గెట్ 16 వేల కోట్లకు పైమాటే. 2 బిలియన్ డాలర్లు రాబడితే తప్ప ‘అవతార్-2’ హిట్ అనిపించుకోదని స్వయంగా దర్శక నిర్మాత కామెరూనే ప్రకటించాడు.

ఐతే ప్రపంచవ్యాప్తంగా ఇండియా సహా పలు దేశాల్లో ‘అవతార్-2’ అంచనాలకు తగ్గట్లే వసూళ్లు రాబట్టినా.. హాలీవుడ్ సినిమాలకు అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాలోనే ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసింది. వీకెండ్, వీక్ వసూళ్లలో కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోయింది. దీంతో ఓవరాల్ వసూళ్లు కూడా అంచనాలకు తగ్గట్లు లేవు. రెండో వీకెండ్ తర్వాత టికెట్ల ధరలు తగ్గించి మరింతగా ప్రేక్షకులను ఆకర్షించడానికి, లాంగ్ రన్ ఉండేలా చూడటానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ ఎంత చేసినా ఈ సినిమా ఫుల్ రన్లో 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం అసాధ్యంగా ఉంది. 1.5 బిలియన్ మార్కును అందుకుంటే గొప్ప అన్నట్లుంది పరిస్థితి.