క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్న ధమాకా సినిమా దాని హీరో రవితేజకే కాదు చాలామంది కెరీర్లలో చాలా కీలకమైంది. క్రాక్‌తో గాడిన పడ్డట్లే కనిపించిన మాస్ రాజా కెరీర్.. ఆ తర్వాత మళ్లీ తడబాటుకు గురైంది. ఈ ఏడాది ఆయన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లాంటి డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇవి రెండూ ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా రామారావు కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ పరిస్థితుల్లో ఇంకో ఫ్లాప్ పడితే రవితేజ మార్కెట్ బాగా డౌన్ అయిపోయి ఆయన తర్వాతి సినిమాల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఆయనకు ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం.
ఇక పెళ్ళిసంద-డి లాంటి పేలవమైన సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ… మంచి పేరు సంపాదించి చకచకా అవకాశాలు పట్టేసింది శ్రీలీల. ఆమె కథానాయికగా నిలబడగలదా లేదా అన్నది ధమాకాతో తేలిపోతుంది. రవితేజ పక్కన ఆమె జోడీ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. మరి ఆయన పక్కన ఆమె ఎంతమాత్రం సూటవుతుందో చూడాలి.
ధమాకా రైటర్, డైరెక్టర్లకు కూడా కీలకమైన సినిమానే. ఈ సినిమా తర్వాత నాగార్జున హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు ప్రసన్నకుమార్ బెజవాడ. రైటర్‌గా ఇప్పటికే మంచి విజయాలందుకున్నా.. మెగా ఫోన్ పట్టడానికి ముందు అతను మరోసారి సత్తా చాటాల్సి ఉంది. ఈ సినిమాకు కథ, మాటలే కాదు.. స్క్రీన్ ప్లే కూడా అతడిదే కావడం విశేషం. ఇక దర్శకుడిగా త్రినాథరావు కూడా తన సత్తా ఏంటో చూపించడమూ అవసరమే. రైటింగ్‌తో పాటు టేకింగ్‌కు కూడా పేరొస్తేనే ఆయనకు సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి సినిమాకు హిట్ టాక్ రావాలి. ఆయనకూ మంచి పేరు రావాలి. మరి వీళ్లందరి ఆశలను ధమాకా ఎంతమేర నిలబెడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates