సౌత్ సినిమాలు కాపీ కొడుతూ నీతి కబుర్లా

దక్షిణాది సినిమా ఆధిపత్యం చూసి బాలీవుడ్ జనాలు ఎంతగా రగిలిపోతున్నారో చెప్పడానికి దర్శకుడు రోహిత్ శెట్టి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాడు. రేపు ఇతను దర్శకత్వం వహిస్తున్న సర్కస్ థియేటర్లలో విడుదల కానుంది. రణ్వీర్ సింగ్ డ్యూయల్ రోల్, దీపీకా పదుకునే పూజా హెగ్డేల గ్లామర్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇలా ఆకర్షణలు గట్టిగానే ఉన్నాయి కానీ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. సరే దృశ్యం 2లాగా ఇదీ మౌత్ టాక్ ని నమ్ముకునే ధైర్యం చేస్తోంది. ప్రమోషన్ల కోసం విస్తృతంగా తిరుగుతున్న రోహిత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ హిందీ సినిమా ఎందరో లెజెండ్స్ ని ఇచ్చిందని కొన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఉదాహరణగా చెప్పి కేవలం ఒక ఏడాది ఏదో బ్యాడ్ టైం నడిచినంత మాత్రం దక్షిణాది మేకర్స్ గెలిచినట్టు కాదనే అర్థంలో వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అవుతున్నాయి. అతగాడి లాజిక్ ప్రకారమే చూస్తే మొఘల్ ఏ ఆజంకు ధీటుగా ఇక్కడ మాయబజార్ ఉంది. షోలేకి తీసిపోని రీతిలో అడవిరాముడు ఆడింది. శంకరాభరణం లాంటి అద్భుతాలు నార్త్ లో ఎవరూ చేయలేదు. అమర్ అక్బర్ ఆంటోనీ కన్నా ఎంతో ముందు అక్కినేని ఇద్దరు మిత్రులు వావ్ అనిపించింది.

ఇంకా సౌత్ సినిమానే సజీవంగా తన ఉనికిని చాటుకుంటూ ఉండగా అర్బన్ లైఫ్ ఆకర్షణలో పడిన బాలీవుడ్ దర్శక రచయితలు వాటి చుట్టే కథలు అల్లుకుంటూ మాస్ మూలలను మర్చిపోయారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతార, 777 ఛార్లీ, మేజర్ తదితరాలు హిందీలోనూ భారీ వసూళ్లు రాబట్టుకోవడంతో రోహిత్ శెట్టి లాంటి వాళ్ళు అభద్రతా భావానికి గురవుతున్నారు. ఒకప్పుడు ఓ ముంబై యాంకర్ రానాని కార్నర్ చేయబోతే అతను రివర్స్ పంచ్ ఇచ్చిన వీడియో అందరికీ గుర్తే. సింగం, టెంపర్ లాంటి రీమేకులు కాపీలతో నెట్టుకొచ్చే రోహిత్ ఇలాంటి కబుర్లు చెప్పడమే పెద్ద కామెడీ .