విజయ్ కోసం పవన్ వస్తాడా?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల హడావిడే ఎక్కువగా ఉండేది నిజమే అయినా వారసుడుకి సైతం వాటికి ధీటుగా హైప్ తెచ్చే ప్రయత్నాలు వేగమందుకున్నాయి. థియేటర్ల పంపకాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదురుకుంటున్న దిల్ రాజు వాటికి సమాధానం చెప్పాలంటే అంచనాల పరంగా ఇది తక్కువేమీ తీసిపోలేదని నిరూపించాలి.

ఇప్పటికిప్పుడు పాతిక రోజుల్లో అది జరగని పనే కానీ తనను నమ్ముకుని పెద్ద రిలీజ్ ఇస్తున్న ఎగ్జిబిటర్ల కోసమైతే ఏదో ఒకటి బలంగా చేసి తీరాలి. దానికి ఉన్న ఆయుధం ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే సరిగ్గా ఇక్కడే చాలా లిటిగేషన్లు ఉన్నాయి.

ముందు విజయ్ ఎప్పుడూ తెలుగు ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన దాఖలాలు లేవు. ఇంటర్వ్యూ కావాలంటే చెన్నై రమ్మంటాడు అది కూడా తనకు నచ్చితేనే. లేదంటే నిర్మాత స్వంతంగా పబ్లిసిటీ చేసుకోవాలి. కానీ వారసుడు కేసు వేరు. రాజుగారు తన మీద బోలెడు బడ్జెట్ కుమ్మరించారు. ఎంతో కొంత సహకరించాలి.

అందుకే విజయ్ ని ఒప్పించేందుకు దిల్ రాజు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్. వకీల్ సాబ్ నుంచి దిల్ రాజుకు పవన్ కు మంచి బాండింగ్ మొదలైంది. మరో సినిమా చేద్దామనుకున్నారు కానీ జనసేన వల్ల సాధ్యపడటం లేదు

ఒకవేళ అడిగితే పవర్ స్టార్ నిజంగా ఒప్పుకుంటాడా అంటే అనుమానమే. అసలే అన్నయ్య సినిమాకు పోటీ ఉన్న బొమ్మ. దానికి వెళ్లకుండా దీనికి గెస్ట్ గా వస్తే అభిమానుల్లో వేరే సంకేతాలు వెళ్లొచ్చు. పైగా హాజరైతే విజయ్ గురించి నాలుగు మాటలు చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోలే వారసుడు ప్రచారానికి ఉపయోగపడతాయి.

అది వాల్తేరు వీరయ్యకి ఇబ్బంది కలిగించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. పైగా జనసేన కార్యకలాపాలు, హరిహర వీరమల్లు షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్ కి టైం కూడా లేదు. మరి రాజు గారు అన్నంత పని చేస్తారా లేక ప్రత్యాన్మయం చూస్తారా వేసి చూడాలి