టెన్షన్ పెట్టిస్తున్న అవతార్ 2 రివ్యూలు

ఎల్లుండి విడుదల కాబోతున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ప్రధాన నగరాల్లో రేపు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ల పడబోతున్నాయి. వీటి టికెట్లకు డిమాండ్ మాములుగా లేదు. మిగిలిన షోలకు మరీ భీభత్సమైన పరిస్థితి కనిపించడం లేదు కానీ ఇండియా మొత్తం ఎక్కువ కలెక్షన్ మన తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుందని ఒక అంచనా. నిన్నా మొన్నటి దాకా నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న సమస్య పరిష్కారం కావడంతో బుకింగ్స్ కు రూట్ క్లియర్ అయ్యింది. ఇక అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టడం ఒకటే మిగిలింది

ఇదంతా బాగానే ఉంది కానీ ఓవర్సీస్ మీడియాకు అవతార్ 2 ప్రత్యేక ప్రీమియర్ ని కొద్దిరోజుల క్రితమే ప్రదర్శించారు. నిన్న ముంబై ఐమ్యాక్స్ లో పరిమితంగా వివిధ రంగాల నుంచి ఆహ్వానింపబడిన సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. స్మార్ట్ ఫోన్స్ అనుమతించకపోవడం లాంటి కఠిన నిబంధనల మధ్య ఈ స్క్రీనింగ్స్ జరిగాయి. వాటినైతే కట్టడి చేయగలిగారు కానీ రివ్యూలను ఆపలేరుగా. అవి కాస్తా చల్లగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఊహించని విధంగా డివైడ్ టాక్ వినిపించడం మేకర్స్ ని ఖంగారు పెడుతోంది. కొందరు అద్భుతమని కితాబు ఇస్తున్నారు.

మరికొందరు అబ్బే అనుకున్నంత లేదని ఫస్ట్ పార్ట్ నే తిరగమోత వేసి ఎక్కువ గ్రాఫిక్స్ ని జోడించారని పెదవి విరుస్తున్నారు. అందరి నుంచి కామన్ గా వినిపిస్తున్న ఫీడ్ బ్యాక్ అయితే ఒకటుంది. 3 గంటల 12 నిమిషాల నిడివి చాలా ఎక్కువయ్యిందని అరగంట దాటాక బోర్ గా ఫీలయ్యేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరి గంట మాత్రం జేమ్స్ క్యామరూన్ తనలో రియల్ క్రియేటర్ ని బయటికి తీసుకొచ్చి విజువల్ వండర్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. ఏది నిజమో ఇంకో 48 గంటల లోపే తేలిపోతుంది. వరల్డ్ వైడ్ 52 వేల స్క్రీన్లలో 16 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో అవతార్ 2 థియేటర్లలో అడుగుపెట్టనుంది.