పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమాకు అనుకున్నట్లే ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. వాళ్లందరికీ ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ దిమ్మదిరిగే షాకిచ్చింది. ఈ టైటిల్, పోస్టర్ చూసి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే వారు ఈ సినిమా విషయంలో ఊహించింది వేరు. ఈ రోజు చిత్ర బృందం ఇచ్చిన అప్‌డేట్ వేరు.
ఇంతకుముందు ప్రకటించిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ను పక్కన పెట్టి తమిళ హిట్ ‘తెరి’ని హరీష్-పవన్ రీమేక్ చేస్తున్నట్లు అందరూ భావించారు. సోషల్ మీడియా ప్రచారం అంతా ఇలాగే సాగింది. మరి ఈ చిత్రానికి ఏం టైటిల్ పెడతారు.. పవన్‌ను ఎలా చూపిస్తారు అనే విషయంలో రకరకాల చర్చలు జరిగాయి.
కానీ హరీష్ శంకర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ కొత్త టైటిల్‌తో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తే అందరికీ ‘భవదీయుడు భగత్ సింగ్’యే గుర్తుకొస్తోంది. టైటిల్ సౌండ్ అలాగే ఉంది. పోస్టర్లోనూ పోలికలు కనిపిస్తున్నాయి. This time Its not just entertainment అంటూ ఇంతకుముందు ‘భవదీయుడు భగత్‌సింగ్’ పోస్టర్ మీద ఉన్న క్యాప్షనే ఇందులోనూ కనిపించింది. ముందు అనుకున్న కథనే తీస్తుంటే టైటిల్ ఎందుకు ప్రకటించారన్నది అర్జం కాని విషయం.
చాలామంది హరీష్ తీస్తున్నది ‘తెరి’ రీమేకే అని.. కానీ టైటిల్, ఫస్ట్ పోస్టర్, క్యాప్షన్ విషయంలో మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’ టచ్ ఇచ్చాడని అంటున్నారు. ‘తెరి’ రీమేక్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న నెగెటివ్ క్యాంపైన్‌కు బ్రేక్ వేయడానికే హరీష్ ఇలా చేసినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఒక రకంగా పవన్ ఫ్యాన్స్‌కు హరీష్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతానికి పోస్టర్ ద్వారా ఇది ‘తెరి’ రీమేక్ అన్న సంకేతాలు ఏమీ లేవు కాబట్టి.. ఇప్పటిదాకా చేస్తున్న నెగెటివ్ క్యాంపైన్‌ను కొనసాగించలేరు. అలా అని ఇది కొత్త కథ అని ధీమాగా ఉండలేరు. ఆ అనుమానాలున్నా అలాగే కొనసాగుతాయి కానీ సినిమా రిలీజయ్యే దాకా సైలెంటుగా ఉండాల్సిందే.