క్లాసిక్ సినిమాలకు భారీ అవమానం

పదే పదే పాత సినిమాలు రీ రిలీజ్ చేయడం వల్ల వాటి మీద ఆసక్తి తగ్గిపోయి ఆ ట్రెండ్ కిల్ అయిపోయే ప్రమాదం ఉందని ఎంతగా హెచ్చరించినా నిర్మాతలు లెక్క చేయకుండా తీసుకుంటున్న రిస్క్ క్లాసిక్స్ కి చెడ్డ పేరు తెస్తోంది. కనీస గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడున్న టికెట్ రేట్లకే జనాల్ని మళ్ళీ థియేటర్లో చూడమంటే వాళ్ళు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. మొన్న శుక్రవారం మాయాబజార్, ప్రేమదేశంకు వస్తున్న స్పందన చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు. ప్రధాన కేంద్రాలు అన్నింటిలోనూ వీటిని విడుదల చేస్తే కొన్ని చోట్ల మినహాయించి కనీసం షో ఖర్చులను వెనక్కు తేలేకపోయాయట.

అసలే ఒకపక్క వాతావరణం చలితో చంపేస్తోంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మూవీస్ కే జనం లేక అలో లక్ష్మణా అంటుంటే ఇక వీటి గురించి వేరే చెప్పాలా. నిన్న శనివారం ప్రేమదేశం నమోదు చేసిన ఆక్యుపెన్సీ కేవలం 7 శాతం. పట్టుమని లక్షన్నర కలెక్షన్ కూడా రాలేదు. షేర్ గా లెక్కేసుకుంటే నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది. రాత్రి వేసిన షోలు క్యాన్సిల్ చేసిన దాఖలాలున్నాయి. పట్టుమని పదిహేను పాతిక మంది కూడా రాకపోతే ఎవరైనా చేయగలిగింది ఏముంది. ఇక మాయ బజార్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు.

ఇకపై బయ్యర్లు ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిందే. మళ్ళీ ఈ నెలాఖరుకు బద్రి, గ్యాంగ్ లీడర్ లు వదులుతున్నారు. వాటిని మెగా ఫ్యాన్స్ ఆదరిస్తే సరే. లేదంటే ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. ఒకప్పటి బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ తెరమీద చూపించాలనే ఆలోచన పోకిరితో మొదలైంది. ప్రారంభంలో ఇది అద్భుత ఫలితాలను ఇచ్చింది. తర్వాత జల్సా, చెన్నకేశవరెడ్డిలకు సైతం మంచి ఆదరణ దక్కింది. రెబెల్ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అయినా ఫ్రీగా ఆన్ లైన్లో దొరికే సినిమాలైనా కాస్త తగ్గించి చూపమంటే అది కుదరదని చెప్పి ఇప్పుడు వసూళ్లు రావడం లేదని మొత్తుకుంటే ఎవరికి లాభం.