టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ కెరీర్‌కు ‘గాడ్సే’ అనే సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలామంది అనుకున్నారు. ఆ సినిమా ట్రైలర్ అంత పవర్‌ఫుల్‌గా కనిపించింది. ట్రైలర్లో చూపించిన కొన్ని షాట్లు, సత్యదేవ్ పవర్ ఫుల్ డైలాగు సినిమా మీద అంచనాలు పెంచాయి. ఐతే సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. దాని ఎగ్జిక్యూషన్ తేడా కొట్టి సినిమా సరిగా ఆడలేదు.
ఐతే ఈ చిత్రానికి ఓటీటీలో మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గాడ్సే’ నిర్మాత సి.కళ్యాణ్.. తన సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ కాకపోవడానికి సరైన కాస్టింగ్ లేకపోవడమే కారణమన్నట్లు మాట్లాడాడు. సత్యదేవ్ మంచి నటుడే అయినా.. ఇందులో గాడ్సే పాత్రను అతను కాకుండా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో చేయాల్సిందని, అప్పుడు ఈ చిత్రం చరిత్ర సృష్టించేదని కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు.
కథ బాగుందని, కానీ దీన్ని మోయగలిగే నటుడు కావాలని తాను దర్శకుడికి చెప్పానని.. కానీ అప్పటికే హీరో ఫిక్స్ అయిపోవడంతో చేసేదేమీ లేకపోయిందని కళ్యాణ్ అన్నాడు. పిల్లల్ని బాగా చదివించి వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఈ సినిమా బాగా రీచ్ అవుతుందనుకున్నామని.. కానీ అలా జరగలేదని.. ఐతే సినిమాను థియేటర్లలో చూడకపోయినా ఓటీటీలో బాగా ఆదరించారని ఆయన చెప్పాడు.
ప్రస్తుతం తాను సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు కళ్యాణ్ వెల్లడించారు. ఆ సినిమా పేరు ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అని కూడా ఆయన వెల్లడించారు. ఈ సినిమా పూర్తయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని.. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని ఆయన వ్యాఖ్యానించాడు. దీంతో పాటు రామానుజాచార్య జీవిత కథను నందమూరి బాలకృష్ణతో తీసే అవకాశమున్నట్లు కూడా కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.