మెల్లగా అవతార్ 2 జ్వరం పెరుగుతోంది. దీని మీదున్న హైప్ కి అంచనాలకు తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ క్షణాల్లో సోల్డ్ అవుట్ కావడం లేదు కానీ విడుదల దగ్గర పడే కొద్దీ ఇది అమాంతం ఎగబాకే సూచనలైతే స్పష్టంగా ఉన్నాయి. ఆన్ లైన్లో దాదాపు అన్ని నగరాల్లోనూ టికెట్లు అందుబాటులోనే ఉన్నాయి. అధిక శాతం ఫ్యాన్స్ ముందు రోజు అర్ధరాత్రి వేసే ప్రీమియర్స్ కోసం ఎదురు చూస్తుండటంతో ఫస్ట్ డే షోలకు రెస్పాన్స్ కొంచెం నెమ్మదిగా ఉంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రం క్రమంగా హౌస్ ఫుల్స్ పెరుగుతూ పోతున్నాయి. జిల్లా కేంద్రాలు, ఇతరత్రా బిసి సెంటర్స్ లో ఆ రేంజ్ లో ఊపు లేదు.
నిజానికీ అవతార్ కి భయపడే చిన్న సినిమాలు సైతం తమ రిలీజులను ఆపుకుంటూ వచ్చాయి. దాంతో నేరుగా కలబడే ఇష్టం లేక ఈ డిసెంబర్ 9న ఏకంగా పదిహేను చిత్రాలు మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 16న శాసనసభ, పసివాడి ప్రాణం అనే బడ్జెట్ మూవీస్ తప్ప ఇంకేమీ షెడ్యూల్ చేయలేదు. చివరి నిమిషంలో వీటికీ మార్పులున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎగ్జిబిటర్లు బయ్యర్లు మూకుమ్మడిగా అవతార్ 2 మీదే ఆసక్తి చూపించడంతో థియేటర్లు దానికే ఎక్కువ బ్లాక్ అవుతున్నాయి. హిట్ 2 ఆల్రెడీ నెమ్మదించింది కాబట్టి ఆ టైంకంతా ఫైనల్ రన్ కు వచ్చేస్తుంది
ఒకరకంగా చెప్పాలంటే అవసరానికి మించే అవతార్ 2కి భయపడినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది మాస్ చూసే బొమ్మ కాదు. ఒకవేళ అదిరిపోయే గ్రాఫిక్స్ కట్టిపడేసే కథనం ఉందంటే అప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది కానీ కనీసం మీడియం రేంజ్ హీరోలెవరైనా ధైర్యం చేసి అదే రోజు వచ్చి కంటెంట్ బాగుంటే కనక ఈజీగా గట్టేక్కేది. ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ పిల్లలు టీనేజర్స్ ఎక్కువగా ఉన్న వాళ్లే దీనికి ఆకర్షితులవుతారు. మిగిలినవాళ్లకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. నిఖిల్ 18 పేజెస్, నయనతార కనెక్ట్ వీటిలో ఏదో ఒకటి వచ్చినా బెటర్ గా ఉండేది. మొత్తానికి హాలీవుడ్ మూవీకి సైతం టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది.