అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేడా?‌

ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి ఉద్ధండుల్ని ఢీకొట్టి చిరంజీవి మెగాస్టార్‌‌గా ఎదగడం.. ఒక పాతికేళ్ల పాటు నంబర్ వన్ హీరోగా హవా సాగించడం చిన్న విషయం కాదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాప్ స్టార్ అయ్యాడు చిరంజీవి.

ఐతే కొందరు మాత్రం అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌ల వల్లే చిరుకు ఆ రేంజ్ వచ్చిందని, వాళ్లే ఆయన్ని పైకి తీసుకొచ్చారని అంటుంటారు. అల్లు రామలింగయ్య అల్లుడు అయ్యాకే చిరంజీవి నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లగలిగాడని విశ్లేషిస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా ఇలాగే మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను పెద్ద స్టార్‌గా ఎదగలేకపోవడానికి కారణాలు వివరిస్తూ.. చిరంజీవికి అరవింద్ ఉన్నట్లు తనకు సపోర్ట్‌గా ఎవరూ లేరని వాపోయారు.

మహాభారతంలో అర్జునుడిని శ్రీ కృష్ణుడు ముందుండి నడిపించాడని.. కృష్ణుడు లేకుంటే అర్జునుడు నథింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్‌ను కృష్ణుడిలా, చిరంజీవిని అర్జునుడిలా తాము పోలుస్తామని చంద్రమోహన్ అన్నారు. అర్జునుడు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి.. వైరాగ్యం వస్తే ఏం చేయాలి.. ఎలా గైడ్ చేయాలి.. అన్నది ప్రతి సందర్భంలోనూ కృష్ణుడు చూసుకోవడం వల్ల అర్జునుడు యుద్ధంలో విజయం సాధించాడని.. అలాగే చిరంజీవిని అరవింద్ నడిపించారని చంద్రమోహన్ అన్నారు.

అల్లు అరవింద్ ఒక సక్సెస్ ఫుల్ వ్యక్తి అని.. చిరంజీవి ఏయే వేషాలు వేయాలి.. ఎంత పారితోషకం తీసుకోవాలి.. ఏ బేనర్లను మనం నిలబెట్టుకోవాలి అన్న విషయాలన్నీ అరవింద్ చూసుకున్నారని.. అలాంటి వాళ్లు తమకు లేకపోవడం మైనస్ అయిందని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. ఐతే చిరు ఎదుగుదలలో అరవింద్ సాయపడి ఉండొచ్చు కానీ అరవింద్ లేకపోతే చిరు లేడు అన్నట్లుగా చంద్రమోహన్ మాట్లాడడంపై అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.