పవన్ కల్యాణ్‌కు మామూలు జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ వీరాభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ముందు వరుసలో పెట్టగల పేరు.. బండ్ల గణేష్. పవన్ మీద తన అభిమానాన్ని బండ్ల ఎప్పుడూ దాచుకున్నది లేదు. కొందరు భజన అని విమర్శించినా సరే.. పవన్ పేరెత్తితే చాలా ఆవేశంతో కూడిన అభిమానంతో ఊగిపోతాడు బండ్ల.
ఎలాగోలా పవన్ సాన్నిహిత్యం సంపాదించి ఆయనతో తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలను నిర్మించిన బండ్లకు.. ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. మధ్యలో వేరే హీరోలతోనూ కొన్ని భారీ చిత్రాలు నిర్మించిన బండ్ల.. కొన్ని ఎదురు దెబ్బల తర్వాత సినిమాలు మానేసి సైలెంట్ అయిపోయాడు. కానీ ఈ మధ్య మళ్లీ సినిమాల్లోకి రావడానికి, ప్రొడక్షన్ చేయడానికి రెడీ అయ్యాడు. పవన్ కల్యాణ్ తనతో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడంటూ ఆయన ప్రకటించి చాలా రోజులైంది. కానీ ఆ సినిమా గురించి ఉలుకూ పలుకు లేదు.
పవన్ ఛాన్సిస్తే సినిమా చేద్దామని చూసి చూసి విసిగిపోయిన బండ్ల.. ఇక ఆయనపై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ రోజు బండ్ల వేసిన ఓ ట్వీట్ అలాంటి సంకేతాలే ఇస్తోంది. ‘‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం. దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం. లేకపోతే టైం వేస్ట్. no time to live. life is most important for our family’’.. ఇదీ బండ్ల ట్వీట్.
పవన్‌ను బండ్ల ఎప్పుడూ దేవుడు దేవుడు అంటుంటాడన్న సంగతి తెలిసిందే. తనకు ఆయన సినిమా ప్రొడ్యూస్ చేయడం అనే వరం ఇవ్వని నేపథ్యంలో.. వేరే చోట ప్రయత్నిద్దాం అనే అర్థం వచ్చేలా బండ్ల ట్వీట్ కనిపిస్తోంది. కొత్తగా డీవీవీ బేనర్లో పవన్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నేపథ్యంలో తనకు ఇప్పట్లో పవన్‌తో చాన్స్ రాదని అర్థం చేసుకుని అసంతృప్తితో ఈ ట్వీట్ వేసినట్లున్నాడు బండ్ల.
Gulte Telugu Telugu Political and Movie News Updates