పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆల్రెడీ ప్రకటించిన ప్రాజెక్టులే పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ సినిమాకు అన్నీ రెడీ చేసుకుని కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనుకున్న సినిమా గురించి అసలు సౌండే లేదు.
వినోదియ సిత్తం రీమేక్ సైతం అటకెక్కేసినట్లే ఉంది. ప్రస్తుతానికి పవన్ ఫోకస్ హరిహర వీరమల్లు మీద మాత్రమే ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిన పరిస్థితిలో ఈ సినిమాను పవన్ పూర్తి చేయడమే గగనం అనే చర్చ నడుస్తుండగా.. ఇప్పుడు పవన్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అంటూ ఆసక్తికర ప్రచారం జరుగుతుండడం విశేషం. ఈ ప్రకటన ఆదివారం ఉదయం రాబోతోందన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
పవన్‌తో సినిమా కోసం కొంత కాలంగా గట్టిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయిన సాహో దర్శకుడు సుజీత్.. ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రాన్ని చేయబోతున్నాడట. ఆదివారం ఉదయం 8.55 గంటలకు ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ అంటూ డీవీవీ సంస్థ ఆల్రెడీ ట్విట్టర్లో పోస్టు పెట్టింది. దీని గురించి రకరకాల ఊహాగానాలు నడుస్తుండగా.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది పవన్-సుజీత్ సినిమా గురించేనట.
ఐతే గతంలో తమిళ హిట్ తెరిని పవన్ హీరోగా తెలుగులో తీసేందుకు సుజీత్‌ను దర్శకుడిగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఆ ప్రాజెక్టు సైడైపోయింది. మరి సుజీత్ ఇప్పుడు పవన్‌తో చేయబోయేది ఆ కథా.. లేక కొత్తగా తనేదైనా స్క్రిప్టు రెడీ చేశాడా అన్నది ఆసక్తికరం. ఇది కొత్త కథే అయ్యుండొచ్చని అంటున్నారు. కానీ పవన్ ఈ సినిమా కోసం ఎప్పుడు ఖాళీ చేసుకుని దీన్ని ఎలా పూర్తి చేస్తాడన్నదే ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates