300 కోట్ల సినిమాకు ఇంత అవమానమా

ఈ మధ్య కొన్ని సినిమాల బ్లాక్ బస్టర్ ఫలితాలు అంతు చిక్కడం లేదు. థియేటర్ లో జనం చూసినప్పుడు ఆహా ఓహో అంటూ కలెక్టన్లు కురిపించడం తీరా అవి ఓటిటిలోనో ఇంకెక్కడో స్క్రీనింగ్ జరిగినప్పుడు వీటికా ఇంత బిల్డప్ ఇచ్చారని నిట్టూర్చడం మాములైపోయింది. కానీ ఒక అంతర్జాతీయ వేదిక మీద అవమానం పొందితే మాత్రం అది చాలా దూరం వెళ్తుంది. ఈ ఏడాది బాలీవుడ్ అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ది కాశ్మీర్ ఫైల్స్ కి ఇదే జరిగింది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేదిక మీద జ్యూరీ హెడ్ నాదవ్ లాపిద్ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగుతోంది.

గోవా చిత్రోత్సవం నిర్దేశించిన ప్రమాణాలకు ఏ మాత్రం తగని స్థాయిలో ది కాశ్మీర్ ఫైల్స్ ఉందని, అసభ్యత అశ్లీలత కూడిన ఇలాంటి హింసాత్మక కంటెంట్ ని చూడాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని అన్న మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్క థియేట్రికల్ బాక్స్ ఆఫీస్ వద్దే మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఇలాంటి మూవీకి ఈ తరహా స్పందన రావడం షాక్ కలిగించే అంశమే. కాశ్మీర్ లోయలో ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన పండిట్ల ఊచకోత, ముస్లిం తీవ్రవాదులు చేసిన దారుణాలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు భారీ విజయం అందించింది.

తీరా చూస్తే ఇప్పుడీ పరిణామం ఉత్తరాది పరిశ్రమకు షాక్ కొట్టినట్టు అయ్యింది. బిజెపి తన స్వంత ఎజెండాతో ఈ సినిమాను ప్రోత్సహించిందనే కామెంట్లు ముందు నుంచి వినిపిస్తున్న తరుణంలో ఇలా జరగడం కొత్త చర్చలకు దారి తీస్తోంది. దీనికి రివర్స్ లో కౌంటర్లు ఉంటాయి కానీ సదరు నాదవ్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడెలా స్పందింస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాములుగా అయితే ఖచ్చితంగా ఉండదు . ఇదే ఈవెంట్ లో చిరంజీవి పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. అఖండ, మేజర్ తదితర చిత్రాలు స్క్రీన్ అయ్యాయి.