వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్ లాంటి దిగ్గజాల తర్వాత టాలీవుడ్‌కు దొరికిన ఉత్తమ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి ఒకరు. ఓవైపు యూత్‌కు నచ్చేలా ట్రెండీగా పాటలు రాయడమే కాక.. ఇంకోవైపు మంచి సాహిత్య విలువలతో గాఢత చూపించడం కూడా ఆయనకు తెలుసు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. వివాదాలకు దూరంగా… ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడే రామజోగయ్య.. తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎవరో చేసిన కామెంట్లకు ఫీలయినట్లే కనిపిస్తున్నట్లున్నారు.
నెగెటివ్ కామెంట్లు చేసేవాళ్లు తన ఫాలోవర్లుగా ఉండొద్దని పరోక్షంగా సంకేతాలు ఇస్తూ.. ఆయన తన పేరు వెనుక పెట్టుకున్న సరస్వతి పుత్ర అనే టైటిల్ విషయంలోనూ వివరణ ఇవ్వడం గమనార్హం.
”ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను…దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు..అన్నట్టు…జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి..”
ఇదీ రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్. వీరసింహారెడ్డి నుంచి తాను రాసిన జై బాలయ్యా పాట లాంచ్ అయిన కాసేపటికే ఆయన ఈ ట్వీట్ వేశారు. దీన్ని బట్టి చూస్తే పాటలోని సాహిత్యం గురించి ఎవరో ఏదో కామెంట్ చేశారని.. ఈ క్రమంలోనే సరస్వతి పుత్ర అని తన పేరు వెనుక పెట్టుకున్న టైటిల్ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. ఈ విషయంలో నొచ్చుకున్న రామజోగయ్య ఈ ట్వీట్ వేశారని అర్థమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates