రష్మిక మీద అర్థం లేని రగడ

నిన్నంతా సోషల్ మీడియాలో రష్మిక మందన్న మీద కన్నడ పరిశ్రమ త్వరలోనే బ్యాన్ విధించబోతోందని, ఆమె నటించిన సినిమాలేవీ కర్ణాటకలో రిలీజ్ కానివ్వకుండా కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకుంటుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తనకు కిరాక్ పార్టీతో మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి చులకనగా మాట్లాడ్డమే దీనికి కారణంగా నెటిజెన్లు చెప్పుకొచ్చారు. దెబ్బకు శ్రీవల్లి ఫ్యాన్స్ కి ఖంగారు మొదలైపోయింది. ఒకవేళ అదే కనక జరిగితే స్టార్ హీరోలు తమ జోడిగా తీసుకోరేమోనన్న ఆందోళన పలు ట్వీట్లలో కనిపించింది.

అసలు కామెడీ ఏంటంటే వాళ్ళు నిజంగా అలా చేయాలనుకున్నా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఎందుకంటే పుష్ప 2 ది రూల్, వారసుడు లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా సినిమాల్లో తనే మెయిన్ లీడ్. వాటిని అడ్డుకుంటే మహా అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన రెవిన్యూ తగ్గిపోతుంది. దానికి బదులుగా తమిళ తెలుగు నిర్మాతలు ఇకపై శాండల్ వుడ్ చిత్రాలను తాము కూడా రిలీజ్ చేయమని భీష్మించుకు కూర్చుంటే వ్యవహారం ఎక్కడికో వెళ్తుంది. ప్రతి నెల కెజిఎఫ్, కాంతారలు తీయరు కదా. రెగ్యులర్ మూవీస్ కూడా ఉంటాయి. వాటికి ఏకంగా నాలుగు రాష్ట్రాల మార్కెట్ పోతుంది. దీని వల్ల నష్టం ఎవరికి?

అయినా రష్మిక వ్యక్తపరిచింది ఒక ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు. అక్కడ ఎవరినీ దారుణంగా కించపరచడం కానీ అవమానించడం కానీ జరగలేదు. వ్యంగ్యంగా కొన్ని అనిపించినా మరీ ఈ స్థాయిలో చర్యలు తీసుకునేవి కాదు. ఎలాగూ టైం లేక మందన్న కన్నడ సినిమాలు చేయడం ఎప్పుడో తగ్గించేసింది. అలాంటప్పుడు అక్కడ నిషేధించినా చేయకపోయినా ఒకటే. ప్రస్తుతానికి రష్మిక నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ కన్నడ ఫ్యాన్స్ లో తన మీద బాగానే ఫైర్ అవుతున్నారు. బ్యాన్ వార్తలను పనిగట్టుకుని మరీ రీ ట్విట్లు చేస్తూ అదేదో నిజంగా జరిగిందన్న భ్రమను కలిగిస్తున్నారు.