సగర్వంగా 400 కోట్ల క్లబ్బులో కాంతార

ఓటిటి రిలీజ్ కు ఇంకొక్క రోజు మిగిలి ఉండగా కాంతార సగర్వంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చాలా తక్కువ బిజినెస్ మోడల్ తో డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవాలా వద్దా అనే అనుమానంతో మొదలుపెట్టి ఇదేం కనక వర్షంరా బాబు అని మురిసిపోయే దాకా పరుగులు పెట్టిన వైనం నిజంగా షాక్ కలిగించింది. కర్ణాటకలో యాభై రోజుల తర్వాత కూడా ఈ స్థాయిలో ప్రదర్శితమవుతున్న మూవీగా కాంతారను అక్కడి మీడియా గొప్పగా పొగుడుతోంది. చాలా సెంటర్స్ లో కెజిఎఫ్ 2 దాటేసి మరీ కొత్త రికార్డులు అందుకున్న కాంతార ఈ ఏడాదిలోనే స్పెషల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది

కన్నడ వెర్షన్ 168 కోట్ల 50 లక్షలతో అగ్ర స్థానంలో ఉండగా తెలుగు డబ్బింగ్ ఏకంగా 60 కోట్లతో అదరగొట్టింది. శాండల్ వుడ్ ని అంతగా పట్టించుకోని తమిళనాడులోనూ 13 కోట్లకు దగ్గరగా వెళ్లడం చిన్న విషయం కాదు. నేటివిటీ సమస్యలు ఉన్నప్పటికీ కేరళ ఆడియన్స్ ఏకంగా 19 కోట్లకు పైగానే వసూళ్ల రూపంలో ఇచ్చారు. ఓవర్సీస్ లో 44 కోట్లతో వామ్మో అనిపించేసింది. ఇక బాలీవుడ్ సినిమాలే జనాన్ని రప్పించడానికి కిందా మీద పడుతుంటే హిందీ నుంచి 96 కోట్లు లాగేయడం రిషబ్ శెట్టి లాంటి పరిచయం లేని టాలెంట్ కి దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి. ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఫైనల్ గా ఇవాళ్టితో నాలుగు వందల కోట్ల తొంబై లక్షలను టచ్ చేసిన కాంతార ఇకపై పెద్దగా రన్ కొనసాగించే అవకాశం తగ్గినట్టే. ఎందుకంటే ఇప్పటికే అన్ని భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజులు జరుగుతున్నాయి. యశోద, మాసూదలకు స్పందన బాగుంది. అటు నార్త్ లో దృశ్యం 2 వచ్చాక మిగిలినవాటిని లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న కాంతార ఇక స్మార్ట్ స్క్రీన్ పై రికార్డులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. శాటిలైట్ హక్కులు సైతం క్రేజీగా అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్ మూడున్నర కోట్లకు అమ్మినట్టు సమాచారం.