అల్ల‌రి న‌రేష్‌ ను టెన్షన్ పెడుతున్న కుర్ర జంట

ఒక మంచి హిట్టు కోసం ఎన్నో ఏళ్ల పాటు సాగిన అల్ల‌రి న‌రేష్‌ నిరీక్ష‌ణ‌కు రెండున్న‌రేళ్ల కింద‌ట తెర‌ప‌డింది. త‌న కామెడీ ఇమేజ్‌కు భిన్నంగా సీరియ‌స్‌గా సాగిన నాంది సినిమాతో న‌రేష్ అత్యావ‌శ్య‌క విజ‌యాన్ని అందుకున్నాడు. నిజానికి చాలా సీరియ‌స్‌గా సాగిన నాంది సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత మంచి విజ‌యాన్ని అందుకుంటుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.

ఐతే న‌రేష్ ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఉన్న సానుకూల అభిప్రాయం, మంచి సినిమా తీస్తే ఆద‌రిద్దాం అన్న ఆలోచ‌న నాందికి క‌లిసొచ్చింది. ఐతే ఈ సినిమా హిట్ట‌యింది క‌దా అని ఎప్ప‌ట్లా ఎడాపెడా సినిమాలు చేసేయ‌లేదు న‌రేష్‌. జాగ్ర‌త్త‌గా త‌న త‌ర్వాతి సినిమాను సెట్ చేసుకున్నాడు. నాంది త‌ర‌హాలోనే మ‌రో సీరియ‌స్ స‌బ్జెక్టుతో అత‌ను చేసిన చిత్రం.. ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఇది సామాజిక అంశాల‌తో ముడిప‌డ్డ సినిమా.

నాంది లాగే ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం కూడా సీరియ‌స్‌గా, ఒక కాజ్‌తో సాగే సినిమా అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైపోయింది. ఐతే నాంది రిలీజైన టైమింగ్ వేరు. ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. నాంది లాగే దీన్ని కూడా అంతే బాగా ఆద‌రిస్తార‌ని గ్యారెంటీ లేదు. సినిమాకు చాలా మంచి టాక్ రావ‌డం కీల‌కం.

దీనికి తోడు ఈ సినిమాకు పోటీగా ల‌వ్ టుడే అనే త‌మిళ అనువాద చిత్రం రిలీజ‌వుతోంది. త‌మిళంలో ఈ చిన్న సినిమా సంచ‌ల‌నం రేపింది. సోష‌ల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చ‌ర్చ న‌డుస్తోంది. పైగా తెలుగు ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. సినిమా బాగుందంటే మ‌న‌వాళ్ల‌కు భాషా భేదం ఉండ‌దు.

ఈ మ‌ధ్య కాంతార అనే క‌న్న‌డ డ‌బ్బింగ్ సినిమాకు ఎలా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారో తెలిసిందే. అలాంటి మ్యాజిక్ రిపీట్ కాకున్నా.. టాక్ బాగుంటే ల‌వ్ టుడే కూడా మంచి వ‌సూళ్లే రాబ‌డ‌తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కాబ‌ట్టి మంచి ప‌బ్లిసిటీ, థియేట‌ర్లు ద‌క్కుతాయి. మ‌రి ఈ ఎంట‌ర్టైన‌ర్ పోటీని త‌ట్టుకుని అల్ల‌రోడి సీరియ‌స్ సినిమా ఎంత‌మాత్రం నిల‌బ‌డుతుందో చూడాలి.