త్రివిక్రమ్‌ను కంగారు పెడుతున్న మహేష్ ఫ్యాన్స్

#Stopdoingroutinemoviesmahesh.. నిన్న సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఉన్నట్లుండి సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు ఈ టెన్షన్ ఎందుకు పుట్టుకొచ్చిందో ఏమో కానీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ సినిమా పట్టాలెక్కుతున్నే సమయంలో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం చిత్ర వర్గాలను కంగారు పెడుతోంది.

నిజానికి చాలా ఏళ్ల నుంచి మహేష్ చేస్తున్న సినిమాల విషయంలో అభిమానులు అంత సంతృప్తిగా అయితే లేరు. రొటీన్ కథలు, ఒకే తరహా లుక్స్‌తో మహేష్ బోర్ కొట్టించేస్తున్నాడనే అసంతృప్తి వారిని వెంటాడుతోంది. సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయి.. మళ్లీ దాన్ని క్యాన్సిల్ చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి రొటీన్ మూవీ చేయడం పట్ల వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక చివరగా మహేష్ నుంచి వచ్చిన ‘సర్కారు వారి పాట’ సంగతి తెలిసిందే.

ఓవైపు మిగతా స్టార్ హీరోలు కొంచెం భిన్నమైన సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతుంటే మహేష్ మాత్రం ఒక ఛట్రంలో ఉండిపోతున్నాడనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అతను త్రివిక్రమ్‌తో జట్టు కడుతున్నాడు. త్రివిక్రమ్ చివరగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఉండొచ్చు కానీ.. ఆయన గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ఇప్పుడు మహేష్‌తోనూ ఆయన అలాంటి సినిమానే చేస్తాడేమో అనే భయం అభిమానులను వెంటాడుతున్నట్లుంది.

అసలే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ చేసి.. తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడేమో కథను మార్చి కొత్తగా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా చిత్ర బృందం కొంచెం టెన్షన్లో ఉండగా.. నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌ను మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం వారిని మరింత కంగారు పెట్టేదే.