త్రివిక్రముడి తక్షణ కర్తవ్యం

ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించాక ఏ దర్శకుడి డిమాండ్ అయినా పీక్స్ కు వెళ్ళిపోతుంది. అందులోనూ త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్ కు జరిగితే ఏమవుతుందో వేరే చెప్పాలా. కానీ అల వైకుంఠపురములో వచ్చి మూడేళ్ళవుతున్నా మాటల మాంత్రికుడి కొత్త సినిమా ఇంకా పురిటి నెప్పులు పడుతూనే ఉంది.

మహేష్ బాబుతో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తాలూకు సరైన అప్డేట్స్ లేక ఒకపక్క అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సూపర్ స్టార్ కు ఫైనల్ స్క్రిప్ట్ పూర్తిగా నచ్చలేదని, ఒక ఫైట్ అయ్యాక కొన్ని కీలక మార్పులు కోరారని అందుకే చిన్న విరామం ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా ఉంది.

నిర్మాత నాగవంశీ అలాంటిదేం లేదనే అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టాడు కానీ సరైన క్లారిటీ మహేష్ టీమ్ లేదా త్రివిక్రమ్ బృందం నుంచి కానీ సరిగా రావడం లేదు. అయినా రాజమౌళి తర్వాత అంత డిమాండ్ ఉన్న దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం అనూహ్యం.

రంగస్థలం తర్వాత సుకుమార్ కూడా సరిగ్గా ఇదే పరిణామం ఎదుర్కున్నాడు. మహేష్ తో సినిమా లాక్ అవ్వడం, తీరా కొంత కాలమయ్యాక డ్రాప్ అవ్వడం, కట్ చేస్తే అల్లు అర్జున్ తో పుష్ప ఓకే అవ్వడం జరిగిపోయాయి. దీనివల్ల సుక్కు పోగొట్టుకున్న విలువైన కాలం ఏడాది పైమాటే. సరే ఇదంతా గత చరిత్ర పక్కన పెడదాం.

ఇంత ప్రచారం జరుగుతున్నా దానికి బ్రేక్ వేసేలా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఫలానా డేట్ కి ఎస్ఎస్ఎంబి 28 కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పడంలేదు. మహేష్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేశాడు. తల్లి మరణం తాలూకు జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడ్డట్టే.

సో త్రివిక్రమ్ తక్షణం ఏదో ఒక రూపంలో దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. తమన్ సైతం ఈ సినిమా ప్రస్తావన తగ్గించేశాడు. సర్కారు వారి పాట టైంలో ఇలా లేడు. ఇన్ని కోణాల్లో ఇన్ని అనుమానాలు రేపుతున్న ఈ అంశాన్ని ఇకనైనా సీరియస్ గా తీసుకోవాలి. అన్నట్టు త్రివిక్రమ్ పుట్టినరోజు నవంబర్ 7. సర్ప్రైజ్ ఏమీ లేనట్టే.