ఒకప్పుడు డబ్బింగ్ చేస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రావేమోనని భయపడి బెంగళూర్ వెళ్లడమే మానుకున్న తెలుగు నిర్మాతలకు కెజిఎఫ్ నుంచి శాండల్ వుడ్ ఒక కొత్త బంగారు బాతులా కనిపిస్తోంది. దాని అనూహ్య విజయం తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ సాధ్యమేనాని డౌట్ పడుతున్న టైంలో ఆరు నెలలు తిరక్కుండానే కాంతార రూపంలో ఇంకో బ్లాక్ బస్టర్ రావడం బట్టి కన్నడ సినిమా స్థాయి ఏ రేంజ్ కు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కిషోర్ లాంటి ఒకరిద్దరు ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ కనీస పరిచయం లేని క్యాస్టింగ్ తో కాంతార ఈ రేంజ్ సక్సెస్ అందుకుందంటే దానికి కారణం కంటెంటే.
కమల్ హాసన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ 2022లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ మూవీగా రెండో స్థానంలో ఉంది. ఎవరూ కదిలించలేని సింహాసనం మీద కెజిఎఫ్ 2 ఉండగా దాని వెనుకే కాంతార విక్రమ్ ని దాటేసి సెకండ్ ప్లేస్ ని సగర్వంగా అది కూడా కేవలం మూడో వారంలోనే అందుకోవడం చిన్న విషయం కాదు. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కాంతార పదిహేను రోజులకు గాను 19 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ ఆదివారం ఇరవై టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలినవాటి కంటే దీని అడ్వాన్స్ బుకింగ్సే జోరుగా ఉండటం దానికి సూచిక.
ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పడం కష్టమనేలా ఉంది. ఎందుకంటే నవంబర్ 4 న కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు రేపుతున్న సినిమాలేం రావడం లేదు. టాక్ బాగుంటేనే థియేటర్లకు కదిలే పరిస్థితులున్న నేపథ్యంలో వాటికి ఓపెనింగ్స్ రావడం కష్టమే. సో ఆల్రెడీ ప్రూవ్ అయిన కాంతారకే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. నెల తిరక్కుండానే క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎంలో గాడ్ ఫాదర్ తీసేసి కాంతార వేస్తే శనివారం సెకండ్ షోకు లక్షకు పైగా గ్రాస్ వచ్చింది. ఇంతకంటే ఉదాహరణ వేరే చెప్పాలా కాంతార ప్రభంజనం గురించి.