విసిగించిన బాలీవుడ్ దేవుడు

బాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతున్నా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ పట్టుమని ఇరవై శాతం లేకపోవడం ట్రేడ్ ని విపరీతమైన ఆందోళనకు గురి చేస్తోంది. చెప్పుకోవడానికి ది కాశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కటియావాడి, బ్రహ్మాస్త్ర పార్ట్ 1లు బ్లాక్ బస్టర్లే కానీ వీటిలో ఏవీ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లో కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయాయి. అందుకే ప్రతి శుక్రవారం నార్త్ మార్కెట్ కి అగ్ని పరీక్షగా మారుతోంది. మొన్న రిలీజైన వాటిలో రామ్ సేతుకి ఆల్రెడీ నెగటివ్ టాక్ రాగా థాంక్ గాడ్ సైతం అంతంతమాత్రంగానే ఉంది.

దీని దర్శకుడు ఇంద్ర కుమార్. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం తేజాబ్, దిల్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన డైరెక్టర్. చాలా గ్యాప్ తీసుకుని ఈ థాంక్ గాడ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. కథేమీ కొత్త కాదు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన బిజినెస్ మెన్ అయాన్ (సిద్దార్థ్ మల్హోత్రా) ఒక యాక్సిడెంట్ చేసి నరకానికి వెళ్తాడు. అక్కడ మాడరన్ అవుట్ ఫిట్ లో చిత్రగుప్తుడు అలియాస్ సీజే(అజయ్ దేవగన్)అతని పాపాల చిట్టా మొత్తం వినిపించి గేమ్ అఫ్ లైఫ్ పేరుతో ఒక ఛాన్స్ ఇచ్చి చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. దీంతో అయాన్ తిరిగి భూలోకానికి వచ్చి మంచి పనులు చేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత జరిగేది ఈజీగా ఊహించుకోవచ్చు.

ఇది మన ఓరి దేవుడా లైన్ కి కొంత దగ్గరగా ఉంటుంది. గతంలోనూ ఇలాంటివి తెలుగు హిందీలో బోలెడొచ్చాయి. పవన్ కళ్యాణ్ రీమేక్ ప్లాన్ లో ఉన్న వినోదయ సితం కూడా ఇదే తరహాలో సాగుతుంది. కథ ఎలా ఉన్నా ఇంద్రకుమార్ కథనం మాత్రం తన తొంభైల నాటి స్టైల్ లో రాసుకోవడంతో థాంక్ గాడ్ ఏ దశలోనూ ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కొంత నవ్వించినా క్యాస్టింగ్ కు తగ్గ కంటెంట్ మాత్రం బలంగా సెట్ చేయలేకపోయారు. పాత చింతకాయ పచ్చడనే ఫీలింగ్ ప్రతి పది నిమిషాలకోసారి కలుగుతూనే ఉంటుంది. ఎంత ఖాళీగా ఉన్నా సరే విసిగించే విషయంలో ఇంద్ర కుమార్ ఫెయిల్ కాలేదు.