పూరి ఎందుకంత ఫైర్ అయ్యాడంటే..

పూరి జగన్నాథ్.. లైగర్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిన మాస్ వార్నింగ్‌కు సంబంధించిన ఆడియో ఒకటి నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మేర నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చాక కూడా డిస్ట్రిబ్యూటర్లు సంయమనం పాటించకపోవవడంపై పూరి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ఈ కాల్‌లో.

తనను బ్లాక్‌మెయిల్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదని.. తనకు వ్యతిరేకంగా ధర్నాలవీ చేస్తే ఆ ధర్నా చేసిన వాళ్లను మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులు ఇస్తానని పూరి ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశం అయింది. ఐతే పూరి ఇంతగా ఆగ్రహానికి గురి కావడానికి కారణం లేకపోలేదు.

తన ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధమైన బయ్యర్లు.. సహచర బయ్యర్లకు వాట్సాప్ మెసేజ్ పెట్టడం.. అది పూరి వరకు రావడంతోనే ఆయనకు మండిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే..

“వరంగల్ శీను లైగర్ బాధితులంతా 83 మంది ఎగ్జిబిటర్స్ గురువారం ఉదయం 9 గంటలకు 27వ తారీఖున ప్రతి ఎగ్జిబిటర్ పూరి జగన్నాథ్ గారి ఇంటికి ధర్నాకు వెళ్తున్నాము. కావున ప్రతి ఎగ్జిబిటర్ మినిమం నాలుగు రోజులు ఉండడానికి బట్టలు తీసుకుని ఎగ్జిబిటర్‌తో నలుగురు వ్యక్తులను తీసుకుని రావాలి. ఇలా అందరూ మాకెందుకులే అని రాకపోతే ఈ బాధితుల లిస్టులో నుంచి మీ పేరును తొలగించి మీకు రావాల్సిన డబ్బులు కూడా క్యాన్సిల్ చేయబడును. దీన్ని హెచ్చరికగా భావించకుండా తప్పనిసరిగా రాగలరు. ఎవరు ఆ రోజు రాకపోయినా మీకు మేము ఫోన్ చేయము. ఇన్ఫర్మేషన్ ఇవ్వము. అందరూ బాధితులమే కాబట్టి అందరూ బాధ్యతగా వస్తేనే బాగుంటుంది. రాకపోతే మీ ఇష్టం. అందరూ ఉదయరెడ్డి వేణు గోపాల్ రెడ్డి ఆఫీస్‌కి రావాలి. అక్కడి నుంచి పూరి జగనన్న ఇంటికి వెళ్లాలి. మళ్లీ మళ్లీ చెబుతున్నాము దయచేసి మీరందరూ రావలి. పైసలు వద్దు అనుకున్న వాళ్లు మాత్రం రాకండి”.. ఇదీ ఆ మెసేజ్ సారాంశం.