తెరమీద కూడా విశ్వక్ ఫ్యానిజం

ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్న విశ్వక్ సేన్ దానికి తగ్గట్టే కథల ఎంపికలో జాగ్రత్తగానే వెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఓరి దేవుడాకు మంచి రిపోర్ట్స్ తో పాటు టాక్ కూడా పాజిటివ్ గా ఉంది. ఇది ఏ రేంజ్ కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందనేది ఓ వారం రోజులయ్యాక తెలుస్తుంది. విశ్వక్ వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ప్రమోషన్ ఈవెంట్లో ఓ ఫ్యాన్ తారక్ ని ఎందుకు తీసుకురాలేదని అడిగితే ప్రతిసారి ట్రై చేస్తూనే ఉన్నానని అయినా కుదరలేదని నెక్స్ట్ టైం మాత్రం మిస్ చేయనని పబ్లిక్ గానే హామీ ఇచ్చేశాడు.

ఇక ఇంటర్వ్యూలలో యంగ్ టైగర్ యాక్టింగ్ గురించి, తన మీద ప్రభావం గురించి చెబుతూనే ఉన్నాడు. ఇక్కడితో అయిపోలేదు. ఓరి దేవుడాలో తన అభిమాన హీరో రెఫరెన్సులు బలంగా వాడాడు. బృందావనంలో చిన్నదో వైపు పెద్దదో వైపు పాట రెండుసార్లు ఒకసారి ఆడియో మరోసారి వీడియో రూపంలో చూపిస్తాడు. హీరోయిన్ తో కలిసి ఓపెన్ థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అక్కడ బాలకృష్ణ సింహా ప్లే అవుతూ ఉంటుంది. ఇంకో సీన్ లో సాంగ్ హమ్మింగ్ చేసుకుంటూ అక్కడా జూనియర్ నే తలుచుకుంటాడు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టలేదు.

ఇదే తరహాలో నాలుగైదుసార్లు నితిన్ పవన్ కళ్యాణ్ మీద ఫ్యానిజం చూపిస్తే ఇప్పుడు విశ్వక్ వంతు వచ్చింది. మొత్తానికి ఇలాంటివి ఆయా స్టార్ల ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేవే. థియేటర్లో వీటికి విజిల్స్ పడుతున్నాయి. విశ్వక్ ఇలా దీనికే పరిమితం కాకుండా తారక్ తో కలిసి నటించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. అదంత సులభం కాదు కానీ ఏ పాత్రైనా సరే అనడం చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చిరు బాలయ్య లాంటి నిన్నటి తరం హీరోల స్థానంలో కొత్త జనరేషన్ కుర్రాళ్ళు పవర్ స్టార్ యంగ్ టైగర్ అంటూ తమకు కనెక్ట్ అయిన వాళ్ళను వాడేసుకుంటున్నారు.