మంచు వారి ఏడు రీమేక్‌లు

ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల హవా పుణ్యమా అని ఇప్పుడు అన్ని భాషల చిత్రాలను అందరూ చూసేస్తున్నారు. ఏ భాషలో అయినా ఒక సినిమా చాలా బాగుందని టాక్ కనిపిస్తే చాలు.. వెతికి మరీ సినిమా చూస్తున్నారు. సబ్‌టైటిల్స్‌తో ఏ భాషా చిత్రమైనా ఈజీగా అర్థమైపోతోంది. ఈ పరిస్థితుల్లో రీమేక్ సినిమాలు చేయడం అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా మంది ఒరిజినల్స్ చూసేయడం వల్ల కథ తెలిసిపోయి ఎగ్జైట్మెంట్ పోతోంది. అలా అని తాము చేస్తున్నది రీమేక్ మూవీ కాదని దాచడం కూడా కష్టమే.

ఇటీవల చిరంజీవి నుంచి వచ్చిన ‘గాడ్ ఫాదర్’ కూడా రీమేకే. ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. తొలి వీకెండ్ వరకు జోరు చూపించినా.. ఆ తర్వాత డల్లయిపోయింది. అంతిమంగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో రీమేక్ సినిమాలతో రిస్క్ ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ ఇలాంటి టైంలో మంచు విష్ణు ఏకంగా ఏడు రీమేక్ సినిమాల హక్కులు కొన్నట్లు చెబుతుండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకేసారి ఇన్ని రీమేక్ సినిమాల రైట్స్ తీసుకున్న హీరో టాలీవుడ్లో దాదాపు కనిపించడు. కానీ విష్ణు ఏ ధైర్యంతో ఈ పని చేశాడో తెలియదు. తాను రైట్స్ తీసుకున్న సినిమాల్లో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ కూడా ఒకటని అతను వెల్లడించాడు. మలయాళంలో ఈ ప్రయోగాత్మక చిత్రం పెద్ద హిట్టయింది. దీన్ని తమిళంలో ఆల్రెడీ రీమేక్ చేశారు. తన తండ్రి ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుందని, ఆయన కోసమే రైట్స్ తీసుకున్నామని విష్ణు వెల్లడించాడు.

మిగతా ఆరు రీమేక్‌ సినిమాల గురించి ఈ నెల 12న వెల్లడించబోతున్నట్లు విష్ణు ప్రకటించాడు. మరి ఆ రోజు స్పెషల్ ఏంటో తెలియదు మరి. విష్ణు కొత్త చిత్రం ‘జిన్నా’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేని విష్ణుకు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.