చిన్నతనంలో పిల్లల్ని తల్లిదండ్రులు మందలించడం.. హద్దులు దాటి ప్రవర్తించినపుడు ఒక దెబ్బ కొట్టడం మామూలే. ఐతే యుక్త వయసు వచ్చాక చాలామంది కొట్టడం మానేస్తారు. ఇక పెళ్ళయి పిల్లల్ని కూడా కన్నాక తమ పిల్లల మీద చెయ్యెత్తే వాళ్లు అరుదే. ఐతే అల్లు అరవింద్‌ను ఆయన తండ్రి అల్లు రామలింగయ్య 47 ఏళ్ల వయసొచ్చాక కూడా చెంపదెబ్బ కొట్టారట. ఈ విషయాన్ని ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అరవింద్ పంచుకున్నారు.
తెర మీద తన తండ్రి ఎప్పుడూ నవ్వులు పండిస్తూ ఉంటారు కానీ.. బేసిగ్గా ఆయన చాలా సీరియస్ అని చెబుతూ ఆ ఉదంతాన్ని అరవింద్ గుర్తు చేసుకున్నారు. మీకు పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా తండ్రి దగ్గర సన్మానం జరిగిందని విన్నాను నిజమేనా అంటూ అరవింద్‌ను ఆలీ అడగడం విశేషం. దీనికి అరవింద్ ఏమన్నారంటే..
“మా నాన్న తెరమీద నవ్విస్తారు కానీ బేసిగ్గా చాలా సీరియస్ మనిషి. మా నాన్నకు, అమ్మకు ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండేవి. అది ప్రధానంగా ఆయన డ్రింకింగ్ అలవాటు గురించే. ఒకసారి నాన్నకు, అమ్మకు ఇలాగే గొడవ జరిగింది. ఉన్నట్లుండి అమ్మ ఇంటర్ కామ్ ద్వారా మేడ మీద ఉన్న నాకు ఫోన్ చేసింది. అర్జెంటుగా షర్టు వేసుకుని కిందికి రమ్మంది. వెళ్తే.. మీ నాన్న నాతో గొడవపడి కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా బయటికెళ్లిపోయారు, వెళ్లి తీసుకురా అని చెప్పింది. నేను కారు తీసుకుని వెళ్తే వీధి చివర్న కనిపించారు. కారు ఎక్కమన్నాను. ఆయన ముందు ఇంట్లో అడుగు పెట్టను అని మారాం చేసి తర్వాత కారెక్కారు. ఐతే ఆయన అలా నడిచి వెళ్లిపోవడంపై నాకు చాలా కోపం వచ్చి ఆ కోపాన్ని ఇంటి గేట్లోకి కారు ఎంటరవుతున్న టైంలో బ్రేక్ మీద చూపించేశాను. సడెన్ బ్రేక్ వేసేసరికి నాన్న ఎగిరి ముందుకు పడ్డారు. ఆయనకు కోపం నషాళానికి అంటి వెంటనే నా చెంప చెల్లుమనిపించారు. ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది అన్నారు. నాకు అంతకుమించి కోపం వచ్చింది. కానీ నేను గొడవ చేస్తే నాపై ఆయన చేయి చేసుకున్న విషయం నా భార్యకు తెలిసిపోతుందని ఊరుకున్నా. బయటికి చూస్తే ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. ఇంట్లోకి వెళ్లాక కూడా ఆయనతో ఏమీ అనలేదు. అసలు విషయం తెలిస్తే నా భార్య ముందు పరువు పోతుందనుకున్నా. కానీ రాత్రి బెడ్ రూంకి వెళ్తే మావయ్యగారేంటి అలా కొట్టేశారు అంది మా ఆవిడ. నన్ను ఆయన కొట్టడాన్ని మేడ మీద వరండా నుంచి చూసి భయపడి లోపలికి వెళ్లిపోయిందట. ఐతే అప్పటికి నాన్న మీద కోపం వచ్చినా నాకు అది స్వీట్ మెమొరీగా మిగిలిపోయింది. 47 ఏళ్ల వయసులో నన్ను కొట్టే చనువు ఆయనకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది” అని అరవింద్ గుర్తు చేసుకున్నారు. తనను ఈ ప్రశ్న అడగమని అల్లు అరవింద్ భార్య నిర్మలనే చెప్పిందని ఆలీ వెల్లడించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates