ప్ర‌భాస్ ఫ్యాన్స్.. గుండెపై చెయ్యేసుకోండి

బాహుబ‌లితో ప్ర‌భాస్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏ స్థాయికి చేరాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే ఆ త‌ర్వాత వ‌చ్చిన అత‌డి రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ అంచ‌నాలు అందుకోలేక‌, త‌న ఇమేజ్‌ను మ్యాచ్ చేయ‌లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. వీటి త‌ర్వాత రాబోయే ఆదిపురుష్ అయినా అద్భుతాలు చేస్తుందేమో అని ఆశిస్తే.. దాని మీద విప‌రీత‌మైన నెగెటివిటీ క‌నిపిస్తోంది. ఆదిపురుష్ టీజ‌ర్ విష‌యంలో ఎంతగా ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే.

సినిమాను ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది సందేహంగానే ఉంది. ఇది యానిమేష‌న్ డామినేటెడ్ మూవీలా క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌భాస్ ఇందులో పెద్ద‌గా చేసిందేమీ ఉండ‌ద‌నే అభిప్రాయం కూడా క‌లుగుతోంది. అందులోనూ ఇది అంద‌రికీ తెలిసిన రామాయ‌ణ గాథ కావ‌డం వ‌ల్ల కూడా ఎగ్జైట్మెంట్ త‌క్కువ‌గానే ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ అభిమానులు ఆదిపురుష్‌ సినిమా మీద కూడా పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోవ‌ట్లేదు. వారి దృష్టంతా స‌లార్ మీదే ఉంది. కేజీఎఫ్‌-1, 2 చిత్రాల‌తో భారీ విజ‌యాలందుకున్న ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా కావ‌డంతో ప్ర‌భాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేసే మాస్ మ‌సాలా సినిమా చూడ‌బోతున్నామ‌నే ఆశ‌తో ఉన్నారు. ఈ విష‌యంలో ప్ర‌భాస్ అభిమానులు గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చ‌నే సంకేతాలు ఇచ్చాడు ఇందులో విల‌న్ పాత్ర చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్. ఆదివారం అత‌డి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా స‌లార్‌లో అత‌డి పాత్ర‌కు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇందులో పూర్తిగా ప్ర‌శాంత్ ముద్ర క‌నిపించింది. పృథ్వీరాజ్ డిఫ‌రెంట్ లుక్‌లో ఫెరోషియ‌స్‌గా క‌నిపించాడు.

ఇక ఈ సంద‌ర్భంగా ఒక ఇంట‌ర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ మాస్,యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్ జాన‌ర్‌కు కొంచెం దూర‌మ‌య్యాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. స‌లార్ పూర్తి స్థాయి యాక్ష‌న్, మాస్ ఎంట‌ర్టైన‌ర్ అని అత‌ను స్ప‌ష్టం చేశాడు. ప్ర‌భాస్‌ను అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా క‌నిపిస్తాడ‌ని, ఇందులో ఎలివేష‌న్ల‌కు, మాస్ అంశాల‌కు లోటు ఉండ‌ద‌ని చెప్పాడు. కాబ‌ట్టి ఆదిపురుష్ సంగ‌తి కొంచెం అటు ఇటు అయినా స‌లార్ మీద అభిమానులు భ‌రోసాతో ఉండొచ్చ‌న్న‌మాట‌.