తమిళ క్రిటిక్సూ.. ఇటు చూడండమ్మా

గత నెల తమిళ భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ రిలీజైనపుడు తమిళ ప్రేక్షకులు, అక్కడి క్రిటిక్స్ చేసిన అతి అంతా ఇంతా కాదు. తమిళంలో సూపర్ పాపులర్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మణిరత్నం.. తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ నవల చదివిన వాళ్లకు ఆ కథ, అందులోని పాత్రలను తెరమీద చూసినపుడు ఏ కన్ఫ్యూజన్ లేకపోయింది. కానీ నవల చదవని తమిళులకే ఆ సినిమా సరిగా అర్థం కాలేదన్ని కంప్లైంట్.

ఇంకా మొత్తం తమిళ పేర్లు, తమిళ నేటివిటీని గుప్పించి.. కథను చాలా గందరగోళంగా నడిపించడంతో ఇతర భాషల ప్రేక్షకులకు ఆ సినిమా ఎక్కలేదు. అందులోనూ ‘బాహుబలి’ లాంటి సినిమాలో పతాక స్థాయి ఎలివేషన్లు, యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్లు చూసిన మన ప్రేక్షకులకు ‘పొన్నియన్ సెల్వన్’ ఏమాత్రం రుచించలేదు. దీంతో ఇక్కడ ఆ సినిమాకు తిరస్కారం తప్పలేదు.

ఐతే మన ప్రేక్షకుల నిర్ణయాన్ని గౌరవించకుండా తమిళ జనాలు చాలా అతి చేశారు. తాము ‘బాహుబలి’ని నెత్తిన పెట్టుకుంటే ‘పొన్నియన్ సెల్వన్’ను తెలుగు ప్రేక్షకులు డీగ్రేడ్ చేస్తున్నారని, మన వాళ్లకు టేస్ట్ లేదని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. పేరున్న తమిళ క్రిటిక్స్ ఈ విషయంలో వార్నింగులు కూడా ఇచ్చారు. ఐతే బలమైన కంటెంట్ ఉంటే ఇతర భాషా చిత్రాలను మనవాళ్లు ఆదరించినట్లు ఎవ్వరూ ఆదరించరన్నది వాస్తవం. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి.

ఇప్పుడు కన్నడ చిత్రం ‘కాంతార’కు తెలుగులో వస్తున్న స్పందన చూస్తే మన ప్రేక్షకులు ఏంటి అన్నది తమిళ జనాలకు అర్థమవుతుంది. నిజానికి ఈ చిత్రం కూడా కన్నడ నేటివిటీ, అక్కడి ఆచారాల చుట్టూ తిరిగే సినిమానే. కానీ యూనివర్శల్ అప్పీల్ ఉండేలా, ఆసక్తికరంగా ఆ విషయాన్ని ప్రెజెంట్ చేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి.

ఈ సినిమాను కన్నడలో చూడ్డానికే ఎగబడ్డ మన ప్రేక్షకులు.. తెలుగులో రిలీజ్ చేయడంతో గొప్పగా ఆదరిస్తున్నారు. తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన సినిమా.. రెండో రోజు మరింత పుంజుకుంది. చూస్తుంటే ‘కాంతార’ తెలుగులో చాలా పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది. మన వాళ్లకు నచ్చేలా సినిమా తీయాలే కానీ ఏ సినిమానైనా ఎంత బాగా ఆదరిస్తారనడానికి ఇది తాజా రుజువు. ఇలాంటి ఆడియన్స్ ఇండియాలో ఇంకెక్కడా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం అర్థం కాక అతి చేసిన తమిళ జనాలు, క్రిటిక్స్ ‘కాంతార’కు తెలుగులో వస్తున్న స్పందనను ఒకసారి చూడాలి.