ఆ వార్తలను ఖండించిన మంచు విష్ణు

Manchu Vishnu
Manchu Vishnu

మంచు విష్ణు ఆదిపురుష్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రెండు రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టీజర్ విషయంలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇది యానిమేటెడ్ మూవీ అని జనాలను ప్రిపేర్ చేయకపోవడం వల్లే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ట్రోల్స్ జరిగాయని.. స్వయంగా తాను కూడా టీజర్ చూసి డిజప్పాయింట్ అయ్యానని.. మోసపోయిన ఫీలింగ్ కలిగిందని మంచు విష్ణు అన్నట్లుగా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.

కొన్ని ప్రధాన ఇంగ్లిష్ పత్రికల్లో సైతం దీని గురించి వార్తలు రావడంతో వెబ్, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. అందరూ ఇది అథెంటిక్ న్యూసే అనుకుని దీన్ని పబ్లిష్ చేశారు. కానీ మంచు విష్ణు మాత్రం అసలు తానీ వ్యాఖ్యలు చేయనే లేదని తేల్చేశాడు.

తన కొత్త చిత్రం జిన్నా విడుదల ముంగిట దాని మీద నెగెటివిటీ పెంచేందుకు కావాలనే ఎవరో ఈ వార్తలు పుట్టించారంటూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు విష్ణు. ప్రభాస్ తన డార్లింగ్ అని, అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటానని, అంతే తప్ప తన సినిమా గురించి నెెెగెటివ్ కామెంట్స్ చేసే అవకాశమే లేదని విష్ణు తేల్చేశాడు.

అలాగే ‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన తీర్మానాలకు సంబంధించి జరుగుతున్న ఓ ప్రచారాన్ని కూడా విష్ణు ఖండించాడు.

‘మా’లో సభ్యత్వం రావాలంటే హీరో అయినా, హీరోయిన్ అయినా కనీసం రెండు సినిమాల్లో నటించి ఉండాలని, అవి థియేటర్ లేదా ఓటీటీలో రిలీజై ఉండాలని తాను పేర్కొన్నట్లుగా ఉన్న ఒక వార్తను పోస్ట్ చేసి ఇది కూడా నకిలీ వార్త అని, పెయిడ్ బ్యాచ్ ఇలా ఎందుకు తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తోందో అర్థం కావడం లేదని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశాడు.