మొన్నటివరకు పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉండేదంటే.. టైముకి కాస్త లేటుగా సెట్టుకు వచ్చేసి, తన వర్క్ అంతా త్వరగా ముగించుకుని, వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయేవారు. పొలిటికల్ గా జనసేనతో బిజీగా ఉన్నారు కాబట్టి, అంతకంటే ఎక్కువ టైమ్ కేటాయించడం కష్టమయ్యేదంట. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు ఈ తరహాలోనే రూపొందాయ్. అయితే ఇప్పుడు మాత్రం సడన్ గా తన తదుపరి సినిమా కోసం పవన్ విపరీతంగా టైమ్ ఇచ్చేస్తుంటే.. అసలు ఏం జరుగుతోంది అనే సందేహం రాకమానదు.
అసలు పాలిటిక్స్ లో లేనప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలకు ఫారిన్ సాంగ్స్ కు డైరక్టర్ ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి, తనే రెండ్రోజుల్లో సాంగ్ పూర్తిచేసుకుని ఇండియా తిరిగొచ్చేవాడు. ఇప్పుడేమో అసలు టైమ్ అనేది ఇవ్వట్లేదు. కాని క్రిష్ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ ఎక్కడలేనంతా సమయాన్ని అర్పిస్తున్నాడు. మొన్నటికి మొన్న రీడింగ్ సెషన్ కు విచ్చేశాడు, ఇప్పుడేమో ఫైటింగ్స్ ప్రాక్టీస్ కు వస్తున్నాడు. తరువాత డ్యాన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయట. అసలు తెలుగు హీరోలు రీడింగ్ సెషన్ కు రావడమా? సెట్టుకొచ్చాక డైలాగ్స్ మార్చండి, పేకప్, అంటూ నిర్మాతలను బెంబేలెత్తించే స్టార్స్ ఉన్న ఈ రోజుల్లో.. పవన్ ఇంత ఎనర్జీ పెట్టేసి ఎందుకు పనిచేస్తున్నాడు అనే సందేహం రాకమానదు.
నిజానికి షెడ్యూల్ గ్యాప్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రషెస్ చూసిన పవన్ బాగా ఫిదా అయిపోయాడట. అసలే తనకిది తొలి పౌరాణికం. అయినాసరే క్రిష్ ఉన్నాడు కాబట్టి గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. దానికితోడు అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి, ఇంకాస్త కష్టపడితే నిర్మాతకు భారీగా ప్రాఫిట్స్ వస్తాయని పవన్ ఆశిస్తున్నాడట. అసలు కష్టాల్లో ఉన్న ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకే పవన్ ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి, ఆ సహాయం ఏదో కాస్త గాట్టిగా చేయాలని ఫిక్సయినట్లున్నాడులే.