ఇండియన్ సినిమాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో నిరాశ పరిచిన ప్రభాస్.. ‘తానాజీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన ఈ మోడర్న్ రామాయణంతో ప్రేక్షకులను మెప్పిస్తాడనే అంచనాతో ఉన్నారు అభిమానులు. ఐతే ఆదివారం రిలీజ్ చేసిన టీజర్ చూశాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
కొందరేమో అందులో విజువల్స్, నరేటివ్ స్టైల్ చూసి మెస్మరైజ్ అయిపోతుంటే.. కొందరేమో అవేం గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్.. రామాయణం తీస్తూ ఆ కృత్రిమత్వం ఏంటి.. ఇందులో అసలెక్కడ డివైన్ ఫీలింగ్ కనిపిస్తోంది అని ప్రశ్నిస్తున్నారు. ఒక టీజర్ గురించి ఇంత వైరుధ్యమైన స్పందన అరుదుగా జరుగుతుంటుంది. ఐతే సోషల్ మీడియాను పరిశీలిస్తే మాత్రం మెజారిటీ జనాలు నెగెటివ్‌గానే స్పందిస్తున్న విషయం స్పష్టమవుతోంది.
అలా అని ఈ నెగెటివిటీని చూసి సినిమా పూర్తిగా తేడా కొడుతుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏమో ఈ వెర్షనే జనాలకు నచ్చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలకు బాగా కనెక్ట్ కావచ్చు. భారీ ఓపెనింగ్స్‌తో మొదలుపెట్టి సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కావచ్చు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఇలాగే ట్రైలర్ తర్వాత నెగెటివిటీ ఎదురైనా, రిలీజ్ రోజు అంత మంచి టాక్ ఏమీ రాకున్నా భారీ ఓపెనింగ్సే తెచ్చుకుంది. కొన్ని వారాల పాటు థియేటర్లలో నిలబడింది. దాంతో పోలిస్తే ‘ఆదిపురుష్’ రేంజ్ పెద్దదే. సినిమాకు రీచ్ కూడా ఎక్కువే. కాబట్టి సినిమా బ్లాక్‌బస్టర్ అయినా ఆశ్చర్యం లేదు.
ఒకవేళ ఇదే నెగెటివిటీ రిలీజ్ రోజు మెజారిటీ జనాల నుంచి కనిపిస్తే.. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలాగే ప్రేక్షకులకు రుచించకపోతే సినిమా పెద్ద డిజాస్టర్ అయినా కావచ్చు. ఆ రోజు ‘ఆదిపురుష్’ ట్రోల్ మెటీరియల్‌గా మారినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ‘ఆదిపురుష్’ అయితే బ్లాక్‌బస్టర్ అయినా అవుతుంది.. లేదా డిజాస్టర్ అయినా అవుతుంది. అంతే తప్ప పర్వాలేదు, ఓ మోస్తరుగా ఉంది అనే మాటలు వినిపించకపోవచ్చు. వసూళ్లు, బాక్సాపీస్ ఫలితం కూడా అందుకు అనుగుణంగా ఉండకపోవచ్చు.