మలయాళం జోలికి ఎందుకు వెళ్తున్నట్టో

ఇంకో పది రోజుల్లో గాడ్ ఫాదర్ దర్శనమివ్వబోతున్నాడు. వస్తుందా రాదానే అనుమానాలన్నీ తొలగిపోయాయి. 28న అనంతపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ట్రైలర్ ఆదివారమే వచ్చే అవకాశముంది కానీ ఇంకా ఖరారుగా చెప్పలేదు. ఫైనల్ కట్ మాత్రం రెడీ చేశారట. చిరంజీవి చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టైం చెప్పేస్తారు. సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ తో బయట పడింది. రెండు మూడు సీన్లు బ్యాలన్స్ ఉన్నాయని వాటిని హడావిడిగా తీస్తున్నారనే పుకార్లకు దర్శకుడు మోహన్ రాజా చెక్ పెట్టేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ గాడ్ ఫాదర్ మలయాళం డబ్బింగ్ వెర్షన్ సిద్ధం చేయడం ఫ్యాన్స్ కి సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఆ అవసరం లేదు. ఎందుకంటే లూసిఫర్ మోహన్ లాల్ కే కాదు మల్లువుడ్ లోనే టాప్ ఫైవ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. దాన్ని రీమేక్ చేసి మళ్ళీ అదే భాషలో వదలడం అంటే లేనిపోని పోలికలు, ట్రోలింగ్ కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఉత్తి టీజర్ కే రచ్చ చేసిన బ్యాచ్ ఉంది. పోనీ సల్మాన్ ఖాన్ ఉన్నందుకు విడుదల చేస్తున్నారా అంటే ఆయన ఉండేదే మహా అయితే ఇరవై నిముషాలు. దానికోసం అక్కడి ఆడియన్స్ ఎగబడి చూస్తారని అనుకోలేం.

కంటెంట్ మరీ ఎక్స్ ట్రాడినరీగా ఉంటే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. పైగా చిరంజీవికి కేరళలో ఇప్పుడేం మార్కెట్ లేదు. ఒకప్పుడు ఘరానా మొగుడు వంద రోజులు ఆడిన చరిత్ర ఉంది కానీ అదంతా మూడు దశాబ్దాల వెనుకటి గతం. అల్లు అర్జున్ లాంటి న్యూ జెనరేషన్ మేనియాలో కేరళ జనాలు చిరుని అదే పనిగా గుర్తు పెట్టుకోరు. మరి కొణిదెల సంస్థ నమ్మకమేంటో అంతు చిక్కడం లేదు. అసలే ది ఘోస్ట్, స్వాతిముత్యం, జిన్నాలతో పాటు వారం ముందు వచ్చే పొన్నియన్ సెల్వన్ 1, నేనే వస్తున్నాతో గాడ్ ఫాదర్ తలపడాలి. మరి ఇంత రిస్క్ ఎందుకు చేశారో వేచి చూడాలి.