టాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సినిమాల్లో ‘ఓరి దేవుడా’ ఒకటి. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘ఓ మై కడవులే’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో. తమిళ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులో దేవుడి పాత్ర కోసం చాలా మంది హీరోలను అనుకున్నారు. కానీ ఫైనల్ గా వెంకీ కి ఫిక్సయ్యారు. ఈ సినిమా మొదలయ్యే సమయానికి వెంకటేష్ ‘నారప్ప’ , ‘దృశ్యం 2’, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే కొన్ని నెలలు వెంకీడేట్స్ కోసం వెయిట్ చేశారు.
తాజగా వెంకటేష్ రోల్ తో ఓ సర్ప్రయిజ్ గ్లిమ్స్ రిలీజ్ చేసి సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని అఫీషియల్ గా చెప్పారు. తమిళ్ లో విజయ్ సేతుపతి , కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఈ రోల్ చేశారు. ఇప్పుడు తెలుగులో వెంకటేష్ ఆ పాత్రలో కనిపించనున్నాడు. మోడరన్ గాడ్ గా కనిపిస్తూ స్పెషల్ రోల్ లో నటించాడు వెంకటేష్. కథలో కీలకమైన పాత్ర ఇది. అందుకే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోను ఎంచుకున్నారు. కాకపోతే సినిమాలో వెంకటేష్ కనిపించేది మొత్తంగా కలిసి ఇరవై నిమిషాల లోపే. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే పాత్ర ఇది. గతంలో వెంకటేష్ కోసం పవన్ గోపాలా గోపాలా లో దేవుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ కోసం వెంకీ దేవుడిగా మారాడు.
ఇక కన్నడలో లక్కీ మెన్ గా రీమేక్ అయిన ఈ సినిమాలో పునీత్ తో కలిసి ప్రభుదేవా ఓ సాంగ్ లో మెరిశాడు. తెలుగులో కూడా ఓ సాంగ్ లో ప్రభుదేవా కనిపించే అవకాశం ఉంది. రెండు భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను పీవీపీ సినిమాస్ నిర్మిస్తుంది. అర్జున కళ్యాణం తో డీసెంట్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఈ రీమేక్ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి వెంకీ సపోర్ట్ తో కుర్ర హిట్ కొడతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.