హీరోలకు గుట్కా యాడ్స్ మీదే దృష్టి

బాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన ప్ర‌కాష్ ఝా.. హిందీ స్టార్ హీరోల‌పై విరుచుకుప‌డ్డారు. రాజ్ నీతి, ఆర‌క్ష‌ణ్‌, చ‌క్ర‌వ్యూహ్, డ‌ర్టీ పాలిటిక్స్, స‌త్యాగ్ర‌హ లాంటి పొలిటిక‌ల్ సినిమాల‌తో మంచి పేరు సంపాదించిన ప్ర‌కాష్ ఝా.. ఇటీవ‌ల హిందీ సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొడుతుండ‌డం, వ‌సూళ్లు అంత‌కంత‌కూ ప‌డిపోతుండ‌డం గురించి ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. దీనికి స్టార్ హీరోలే బాధ్యత వ‌హించాల‌ని, వారికి యాడ్స్ ద్వారా బోలెడంత ఆదాయం వ‌స్తుండ‌డంతో సినిమాల మీద ఆస‌క్తి త‌గ్గిపోతోంద‌ని ఆయ‌న అన్నారు.

ముఖ్యంగా స్టార్ హీరోల‌కు గుట్కా యాడ్స్ మీద‌, వాటి అమ్మ‌కాల మీద ఉన్న ఫోక‌స్ సినిమాల మీద లేక‌పోతోంద‌ని ప్ర‌కాష్ ఝా విమ‌ర్శించారు. ఎవ‌రి పేర్లు ఎత్త‌కుండా కొంద‌రు స్టార్ హీరోల తీరును ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌కాష్ ఝా దుయ్య‌బ‌ట్టారు.

బాలీవుడ్‌లో అయిదారుగురు పెద్ద‌ హీరోలున్నారు. వాళ్లు గుట్కా యాడ్ చేస్తే రూ. 50 కోట్ల దాకా పారితోష‌కం కింద వస్తాయి. అందుకే వాళ్లు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. హీరోలు గుట్కా అమ్ముతుండ‌డం వ‌ల్ల న‌టించ‌డానికి సమయం ఉండటం లేదు. ఒక‌ హీరోకి వరసగా ఐదు ప్లాపులొచ్చాయి. అయినా అత‌ను 12 యాడ్స్ చేస్తున్నాడు. ఒక్కో యాడ్‌కు ప‌ది కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ హీరోల‌తో సినిమాలు తీయాలంటే వారిని భారీగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి.

గ‌తంలో హిట్లు, ఫ్లాపుల గురించి ఆలోచించకుండా గతంలో అందరు ఉత్సాహంగా పనిచేసేవాళ్లు.
సినిమా కోసం ఏమైనా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇండస్ట్రీలోకి కార్పొరేట్లు వచ్చారు. భారీగా డ‌బ్బులు పెడుతున్నారు. వాళ్లు సినిమా చేయాలంటే ముందు హీరోలు సంత‌కం చేయాలి. అది జ‌రిగితే కానీ సినిమా ప‌నులు ముందుకు క‌ద‌ల‌వు. హీరోల సంత‌కం అయ్యాక‌ స్క్రిప్ట్ కోసం వెతుకుతారు. వెంట‌నే క‌థ దొర‌క్క వేరే భాష నుంచి హిట్ట‌యిన సినిమా రీమేక్ హ‌క్కులు కొంటారు. కొన్నేళ్ల నుంచి ఇదే జ‌రుగుతోంది బాలీవుడ్లో అని ప్ర‌కాష్ ఝా అన్నారు.