యూట్యూబ్ అభిమానులకు కొత్త షాక్

అన్ని ఓటిటిలకు చందాలు కట్టలేక ఏదో దొరికిందే చాలని పాత సినిమాలు, టీవీ సీరియళ్లు, కామెడీ షోలతో టైం పాస్ చేయాలనుకునే సగటు సామాన్య ప్రేక్షకుడికి యుట్యూబ్ ఒకటే దిక్కు. ఒకప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉచితంగా ఎంత వినోదాన్ని అయినా సరే అందుకునే వెసులుబాటు ఉండేది. క్రమంగా ఇది కూడా రెవిన్యూ మోడల్ లోకి వెళ్ళిపోయాక పలు మార్పులు వచ్చాయి. వీడియోలకు యాడ్స్ తోడయ్యాయి. ఇంతకు ముందు స్కిప్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదీ లేదు. చచ్చినట్టు ఒకటి రెండు ప్రకటనలు చూస్తేనే మనం కోరుకున్న బొమ్మ వస్తుంది.

సరే ఈ గొడవంతా వద్దనుకునే వాళ్లకు ఏడాది క్రితమే ప్రీమియం సౌకర్యం తీసుకొచ్చి డబ్బులు కడితే నో ఆప్షన్ ఫెసిలిటీ ఇచ్చింది. యాడ్స్ తలనెప్పి భరించలేని లేనివాళ్లు మూడు నెలలు ఫ్రీ ట్రయిల్ వాడి ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ గా మారిపోతున్నారు. అయితే ఈ సంఖ్య భారీగా లేదు. పైసలు మిగులుతాయి కదా పర్లేదు యాడ్స్ చూస్తాం అనుకునే బాపతు కోట్లలో ఉన్నారు. వాళ్లకు ఒక స్వీట్ షాక్ ఇచ్చే ప్లాన్ లో యుట్యూబ్ ఉన్నట్టు సమాచారం. స్కిప్ లేదా ఫార్వార్డ్ చేసే అవకాశం లేని అయిదు యాడ్లు చూశాకే అసలు వీడియో వచ్చేలా సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రయోగాత్మక పరిశీలన జరుగుతోంది. సక్సెస్ అయితే ఫిక్స్ చేసేయొచ్చు. అదే జరిగితే నాన్ ప్రీమియం యుజర్లకు ఇబ్బందే. ముఖ్యంగా ట్రైలర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలు వచ్చినప్పుడు అంతంత సేపు యాడ్స్ చూస్తూ వెయిట్ చేయడమంటే నరకమే. దానికంటే ఖర్చైనా పర్లేదు సొమ్ములు కట్టేద్దాం అనుకునేవాళ్లు ఉంటారు. యుట్యూబ్ ప్లాన్ అదే మరి. ఇదింకా పూర్తి స్థాయి అమలులోకి రాలేదు కానీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆన్ లైన్ లో ఏదీ ఫ్రీగా ఉండదేమో. థియేటర్లో టికెట్ కొని సినిమా చూసినట్టు ఇకపై అన్ని ఎంటర్ టైన్మెంట్ యాప్స్ లోనూ ఖరీదు కట్టే రోజులు రాబోతున్నాయి.