కుండ బద్దలు కొట్టిన వీరమల్లు

పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఇవాళ ఉదయం విడుదల చేసిన హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఇంట్రో వీడియోకు మంచి స్పందన కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ విపరీతమైన జాప్యానికి గురైన కారణంగా అసలు వచ్చే ఏడాదైనా రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ 2023 వేసవి విడుదలనే క్లారిటీ ఇచ్చేశారు. నిమిషంలోపే ఉన్న టీజర్ ని పవన్ కుస్తీ పెహల్వాన్ లతో తలపడటం, తొడగొట్టడం, బ్యాక్ గ్రౌండ్ లో తెలుగోడి గొప్పదనాన్ని వివరించే మాటలకు కీరవాణి మంచి నేపధ్య సంగీతాన్ని అందించడం అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్లిపోయింది.

అంతా బాగానే ఉంది కానీ పవన్ ని తప్ప ఇందులో ఎవరిని రివీల్ చేయలేదు. హీరోయిన్ నిధి అగర్వాల్ ని సైతం దాచి పెట్టేశారు. కేవలం పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసుకుని కట్ చేసింది కాబట్టి ఇంతకన్నా ఆశించలేం. అయితే మిలియన్ల వ్యూస్ రావడం పెద్ద విశేషం కాదు కానీ హరిహర వీరమల్లు టీజర్ తాలూకు ఇంపాక్ట్ బిజినెస్ మీద ఏ స్థాయిలో ఉండబోతోందనే దాని మీద సూర్య మూవీస్ యూనిట్ తీవ్ర పరిశీలన చేస్తోంది. ప్రాజెక్టు మీద రకరకాల గాసిప్పులు ప్రచారమైన నేపథ్యంలో అందరినీ సంతృప్తి పరిచిందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు.

మరి ఆ మధ్య నిర్మాత ఏఎం రత్నం చెప్పినట్టు మార్చి 30కి హరిహర వీరమల్లు రావడం అనుమానమే. సమ్మర్ అన్నారు కాబట్టి ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి కోరుకున్న స్థాయిలో కాకపోయినా వీరమల్లు రేస్ లో ఉన్నాడనే సందేశం ఇవ్వడంలో రత్నం టీమ్ సక్సెస్ అయ్యింది. పవన్ కెరీర్ లోనే మొదటిసారి ప్యాన్ ఇండియా లెవెల్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చారు. శాతకర్ణి, మణికర్ణికలు డీల్ చేసిన దర్శకుడు క్రిష్ సరికొత్త అవతారంలో పవన్ ని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి సగటు మూవీ లవర్స్ ప్రతిఒక్కరిలోనూ ఉంది.