య‌థా గురు.. త‌థా శిష్యులు

ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ ప‌రిస్థితి ఇప్పుడెంత ద‌య‌నీయంగా త‌యారైందో తెలిసిందే. ఈ ఏడాది ఆయ‌న్నుంచి మూణ్నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. వాటి పేర్లేవో చెప్ప‌మ‌న్నా కూడా క‌ష్ట‌మ‌య్యే ప‌రిస్థితి. అందులో ఏ సినిమాకు కూడా రిలీజ్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాలేదు. వ‌ర్మ సినిమాల్లో క్వాలిటీ ఎంత దారుణంగా ప‌డిపోయిందో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు.

అయినా స‌రే.. ఆయ‌న ఎలాగోలా నిర్మాత‌ల‌ను సంపాదించుకుని సినిమాలు చేస్తున్నారు. ఇంత‌కుముందులా ఆయ‌న ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు సైతం ప‌ని చేయ‌ట్లేదు. వ‌ర్మ డైహార్డ్ ఫ్యాన్స్ ఎప్పుడో ఆయ‌న్ని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. వ‌ర్మ ప‌రిస్థితి ఇలా ఉంటే.. నెమ్మ‌దిగా ఆయ‌న శిష్యులు కూడా ఒక్కొక్క‌రుగా ఆయ‌న బాట‌లో న‌డుస్తూ ద‌య‌నీయ స్థితికి చేరుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

వ‌ర్మ శిష్యుల్లో ఆయ‌న త‌ర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్ల‌లో కృష్ణ‌వంశీ ఒక‌రు. ఐతే ఆయ‌న చంద‌మామ త‌ర్వాత ఓ మోస్త‌రుగా అనిపించే సినిమా కూడా ఏదీ తీయ‌లేదు. మొగుడు, న‌క్ష‌త్రం లాంటి సినిమాలు కృష్ణ‌వంశీ అభిమానుల‌ను బెంబేలెత్తించాయి. ఇప్పుడాయ‌న్నుంచి రంగ‌మార్తాండ రావాల్సి ఉంది. కానీ దానికి అస‌లు బ‌జ్ లేదు. ఇక వ‌ర్మ మ‌రో శిష్యుడు తేజ‌.. గ‌త రెండు ద‌శాబ్దాల్లో నేనే రాజు నేనే మంత్రి మిన‌హాయిస్తే హిట్ ఇవ్వ‌లేక‌పోయాడు. అది కూడా ఫ్లూక్ హిట్ అనేలా త‌ర్వాత తీసిన సీత డిజాస్ట‌ర్ అయింది. ఇప్పుడు తేజ నుంచి రాబోతున్న సినిమాకు బ‌జ్ లేదు. 

ఇక పూరి శిష్యుల్లో అత్యంత పాపుల‌ర్, ఎక్కువ స్టార్ డ‌మ్ సంపాదించిన పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిస్థితి తెలిసిందే. తాజాగా లైగ‌ర్ ఆయ‌న ప‌త‌నానికి సాక్ష్యంగా నిలిచింది. ఇస్మార్ట్ శంక‌ర్‌తో హిట్ కొట్టినా అది గాలివాటం అనిపించేలా లైగ‌ర్ చ‌తికిల‌బ‌డింది. ఈ సినిమా చూశాక పూరి పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడనే ఫీలింగ్ క‌లిగింది జ‌నాల‌కు. ఇక వ‌ర్మ మ‌రో శిష్యుడు గుణ‌శేఖ‌ర్ ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. శివ‌నాగేశ్వ‌ర‌రావు, నివాస్ లాంటి వాళ్లు ఎప్పుడో సినిమాలు ఆపేశారు. అజ‌య్ భూప‌తి, జీవ‌న్ రెడ్డి లాంటి వ‌ర్మ‌ కొత్త శిష్యుల ప‌రిస్థితి కూడా ఏమీ బాగా లేదు.