‘పూరి’ రుచి మారాల్సిందే 

ఒకప్పుడు ఆ హోటల్ లో పూరి రుచి అద్భుతం . అమోఘం. ఒక్కసారి అడుగుపెట్టి ఆ టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిందే. అబ్బాబ్బా ఆ చెట్నీ అయితే సూపర్ అంతే…. ఇదేంటి ఏదో హోటల్ లో పూరి రుచి గురించి ఇప్పుడెందుకు ? అనుకోకండి. ఇది దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి అతని అభిమానులు అంటున్న  మాటలు. అవును వారు అంటున్నది అక్షరాల నిజం. పూరి అంటే ఓ ఫైర్ బ్రాండ్. అతని కథలు , సన్నివేశాలు , మాటలు, హీరోయిజం సినిమా అభిమానుల్లో చెరగని ఓ ముద్ర వేసుకున్నాయి.

ఇరవై ఏళ్ళు దాటినా ‘బద్రి’ సినిమా క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. పవన్ ని అంత అగ్రెస్సివ్ గా చూపించడం పూరి వల్లే అయ్యింది. అంతెందుకు రవితేజని రాత్రి కి రాత్రి ‘ఇడియట్’ తో స్టార్ ని చేసింది పూరినే కదా. మహేష్ కి ‘పోకిరి’ , అల్లు అర్జున్ కి ‘దేశ ముదురు’, రామ్ చరణ్ కి ‘చిరుత’, ప్రభాస్ కి ‘బుజ్జిగాడు’ , ఎన్టీఆర్ కి ‘టెంపర్’ , గోపీచంద్ కి ‘గోలీమార్’ ఇలా వాళ్ళ కెరీర్ లో గుర్తుపెట్టుకొనే గొప్ప మెమొరబుల్ మూవీస్ ఇచ్చాడు పూరి. హీరోలకే కాదు వారి అభిమానులకు కూడా ఎప్పటికీ మర్చిపోలేని బెస్ట్ ఫిలిమ్స్ ఇచ్చిన ఘనత పూరికే దక్కుతుంది.

ఇక హిట్లే కాదు పూరి తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా మూవీ లవర్స్ కి ఫేవరేట్ గా ఉంటాయి. ఆ లిస్టులో ‘నేనింతే’ లాంటి సినిమాలుంటాయి. అందులో సన్నివేశాలు , పూరి రైటింగ్ ను ఇప్పటికీ మెచ్చుకునే వాళ్ళు ఎందఱో. అలాంటి పూరి కొన్నేళ్లుగా తనని తాను దాచేసుకుంటూ సరికొత్త పూరి రుచి చూపిస్తున్నాడు. ఆ పాత టేస్ట్ కోసం థియేటర్స్ కి వెళ్ళే ప్రతీ సారి ఏదో చప్పిడి ముద్దలు పెట్టినట్టు కంటెంట్ ఇస్తున్నాడు. అయితే పూరి ఫ్లాఫ్ సినిమాలు , డిజాస్టర్లు చూసి , చూసి జగన్ ‘గన్’ లాంటి  ఓ బ్లాక్ బస్టర్ ఎప్పుడు తీస్తాడో ? అసలు తీస్తాడో లేదో అంటూ ఫ్యాన్స్ అనుకున్న టైంలో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. 

ఆ సినిమా పూరి కి కం బ్యాక్ ఫిలింగా నిలబడింది. ఆ విజయంతో పూరి ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకుంటూ సంబరపడిపోయారు. ఇక నుండి ఇలాంటి సినిమాలే చేయమంటూ పూరిని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. పూరి కూడా విన్నట్టే అంతే ఇకపై తగ్గేదే లే అనేశాడు. విజయ్ దేవరకొండ తో లైగర్ అనగానే పాన్ ఇండియా లెవెల్ లో పూరి ఈసారి అదరగొట్టి రాజమౌళి , సుకుమార్ తర్వాత స్థాయికి చేరుకుంటాడని అందరూ ఊహించారు. కానీ పూరి మళ్ళీ రొటీన్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి ‘లైగర్’ తో బాగా నిరాశ పరిచాడు. దీంతో పూరి అభిమానులు సైతం సోషల్ మీడియాలో పూరి పాత సినిమాలు గుర్తుచేసుకుంటూ ఇదీ నీ రేంజ్ మళ్ళీ పడిపోతున్నావ్ పైకి రమ్మంటూ కోరుతున్నారు.

నిజానికి టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కి లేని ఇమేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ పూరి సొంతం. అతని మాటలు , సినిమాలు అంటే అమితంగా ఇష్టపడే బ్యాచ్ చాలానే ఉన్నారు. ఎప్పటికప్పుడు పూరి నుండి ఓ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటూనే ఉంటారు. కానీ పూరి ఇస్మార్ట్ శంకర్ తో కొంత పైకి లేచి మళ్ళీ ‘లైగర్’ తో కిందకి పడిపోయాడు. పూరి ఫ్యాన్స్ ఇంతగా బాధ పడుతుండడానికి  స్ట్రాంగ్ రీజన్ ఉంది.  పూరి పూర్ రైటింగ్ అందులో ఒకటి కాగా , క్లైమాక్స్ లో టైసన్ లాంటి లెజెండ్ ని పెట్టుకొని అతన్ని సరిగ్గా వాడుకోకుండా చీప్  కామెడీ చేయించడం. ఈ రెండు పూరి అభిమానులను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అందుకే ఇస్మార్ట్ శంకర్ కి ముందు రిక్వెస్ట్ చేసినట్టే మళ్ళీ వెనక్కి రా నువ్వు క్రియేట్ చేసిన ఒకప్పటి  పాత్రలన్నీ ఒక్కసారి గుర్తుచేసుకో , ఆ సినిమాలు చూసుకో అంటూ సోషల్ మీడియా ద్వారా బోలెడంత ప్రేమతో కాస్తంత బాధతో లవ్ లెటర్స్ రాస్తున్నారు.

మరి పూరి తన డ్రీం ప్రాజెక్ట్ తో అయినా అతని అభిమానుల్ని, అలాగే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి విజయపథకాన్ని ఎగరేసి పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతాడేమో చూడాలి.