పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే హీరోకు అవకాశం సులువుగానే రావచ్చు కానీ.. ఆ తర్వాత మనుగడ అంతా తన ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. సరిగా నటించకపోతే, దాని వల్ల సినిమా చెడిపోతే కెరీర్ ముందుకు సాగడం కష్టం. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. తొలి సినిమా ‘ఉప్పెన’తో నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి తన కెరీర్‌కు మాంచి ఊపే ఇచ్చింది. ఐతే ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని తాను చాలా ఇబ్బంది పడడమే కాక.. యూనిట్‌ను ఇబ్బంది పెట్టినట్లు ఆలీ నిర్వహించే టాక్ షోకు అతిథిగా హాజరైన వైష్ణవ్ వెల్లడించాడు.
ఆ చిత్రంలో ‘నీకో మాట చెప్పాలి బేబమ్మా’ అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పాల్సిన సీన్లో తాను తడబడ్డట్లు వైష్ణవ్ వెల్లడించాడు. ఆ సన్నివేశానికి 20కి పైగా టేక్‌లు తీసుకున్నట్లు అతను తెలిపాడు. ఆ సీన్లో తాను కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడాలని.. కానీ డైలాగ్ చెబుతున్నపుడు ఎందుకో తనకు మాటలు రాలేదని.. ఎమోషన్స్ పండించలేకపోయానని వైష్ణవ్ తెలిపాడు.
20 పైగా టేక్స్ అయ్యాయని.. అందరూ ఆ సీన్ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తున్నారని.. అందరి సమయం, డబ్బు వృథా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు వచ్చేశాయని వైష్ణవ్ తెలిపాడు. అలాగే ఈ సినిమాలో ‘జలజలపాత నువ్వు’ రొమాంటిక్ సాంగ్ చేయడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని.. అంతమంది ముందు ఎలా రొమాన్స్ చేయాలో అర్థం కాలేదని అతను తెలిపాడు.
ఇక తాను బాలనటుడిగా చేసిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో తన పాత్రకు డైలాగ్స్ ఉండవని, తాను చాలా సీరియస్‌గా కనిపించాలని.. ఐతే ఒక సీన్లో తాను నవ్వేయడంతో పెదమావయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని వైష్ణవ్ వెల్లడించాడు. ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ చేసిన ‘కొండపొలం’ నిరాశపరచగా.. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజవుతుంది.