ఆర్ఆర్ఆర్ ఒక స‌ర్క‌స్‌: వ‌ర్మ‌

రామ్ గోపాల్ వ‌ర్మ ఏ టాపిక్ గురించి మాట్లాడినా రొటీన్‌కు కొంచెం భిన్నంగానే ఉంటుంది. దాన్ని కొత్త‌ద‌నంగా చూస్తారు కొంద‌రు. తిక్క‌లా భావిస్తారు ఇంకొంద‌రు. కొన్నేళ్ల నుంచి చేత‌లు త‌గ్గించేసి మాట‌ల‌కే ప‌రిమితం కావ‌డంతో ఆయ‌న విలువ కోల్పోయిన మాట వాస్త‌వం. ఇక ట్విట్ట‌ర్లో ఆయ‌న అదే ప‌నిగా ఎవ‌రినో ఒక‌రిని కెలుకుతూ త‌న స్థాయికి త‌గని కామెంట్లు చేస్తూ త‌న విలువ‌ను మ‌రింత త‌గ్గించేసుకున్న సంగ‌తి తెలిసందే. అయినా స‌రే.. అప్పుడ‌ప్పుడు వ‌ర్మ కామెంట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి.

జ‌నాల దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. తాజాగా ఒక ఫిలిం మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని థియేట‌ర్లో చూస్త‌న్న‌పుడు త‌న‌కు స‌ర్క‌స్ లాగా అనిపించింద‌ని రాము వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య‌లను త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్ద‌ని, స‌ర్క‌స్ చూస్తున్న‌పుడు ఎలాంటి ఉత్సాహం క‌లుగుతుందో ఆ ఇనిమా చూస్తున్న‌పుడూ అలాగే అనిపించింద‌ని వ‌ర్మ అన్నాడు. ముఖ్యంగా బ్రిడ్జి ద‌గ్గ‌ర రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి పిల్లాడిని కాపాడే స‌న్నివేశం జెమిని స‌ర్క‌స్ చూస్తున్న భావ‌న క‌లిగించింద‌ని వ‌ర్మ పేర్కొన్నాడు.

ఇక త‌న పాత మిత్రుడు.. దొంగా దొంగా, గాయం చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేసిన మ‌ణిర‌త్నం గురించి మాట్లాడుతూ.. ఆయ‌న సినిమాలు ఏవీ త‌న‌కు న‌చ్చ‌వ‌ని వ‌ర్మ కామెంట్ చేశాడు. అలాగే మ‌ణిర‌త్నంకు కూడా త‌న చిత్రాలు న‌చ్చ‌వ‌ని అన్నాడు. తామిద్ద‌రం క‌లిసి దొంగా దొంగా, గాయం సినిమాల కోసం స్క్రిప్టు చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌పుడు ఒక‌రి మాట ఒక‌రు అస్స‌లు విన‌లేద‌ని.. కానీ ఆ రెండు చిత్రాల్లోనూ టైటిల్స్‌లో త‌మ పేర్లు మాత్రం వేసుకున్నామ‌ని వ‌ర్మ పేర్కొన్నాడు. త‌న కెరీర్లో ఒక స‌బ్జెక్ట్ ఎంచుకుని దానికి స‌రిపోయే న‌టీన‌టుల‌ను ఎంచుకున్న సినిమాలంటే క్ష‌ణ‌క్ష‌ణం, స‌ర్కార్ మాత్ర‌మే అని. ఈ సంద‌ర్భంగా వ‌ర్మ వెల్ల‌డించాడు.