ప్రేక్షకులతో ఆడుకున్న పండుగాడు

పేరుకి శుక్రవారమే కానీ ఇవాళ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సందడి లేదు. కౌంట్ గా చెప్పుకోవడానికి నిన్నటి తిరుతో కలిపి ఏడు సినిమాలు పలకరించాయి. కానీ దేనికీ కనీస స్థాయిలో బజ్ లేకపోవడంతో టికెట్ కౌంటర్లు వెలవెలబోయాయి. ఉన్నంతలో ధనుష్ మూవీకే యూత్ నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక వాంటెడ్ పండుగాడ్ అనే కామెడీ చిత్రం ఇవాళ థియేటర్లను పలకరించింది. అపార అనుభవం కలిగిన రాఘవేంద్రరావు సమర్పణలో చోటా నుంచి బడా దాకా చాలా మంది హాస్య నటులు ఇందులో భాగమయ్యారు.

శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ చూసి ఎంతో కొంత నవ్వుకుందామని వెళ్లిన ఆడియన్స్ కి చుక్కలు కనిపించేశాయి. ఫ్రీగా టీవీలో యూట్యూబ్ లో చూసే జబర్దస్త్ స్కిట్లను కలిపేసి ఓ కథగా కుట్టేసి జనం మీదకు రుద్దేశారు. జైలు నుంచి పారిపోయిన పండుగాడిని పట్టుకుంటే వచ్చే కోటి రూపాయల కోసం హీరో హీరోయిన్ తో పాటు రకరకాల గ్యాంగులు మనుషులు చేసే చిత్ర విచిత్రాల సమూహారమే ఈ వాంటెడ్ పండుగాడ్. కామెడీ మూవీస్ లో లాజిక్స్ అవసరం లేదు కానీ ఎంటర్ టైన్ చేసే మేజిక్ ఉండాలి.

కానీ అది తప్ప ఏవి ఉండకూడదో అన్నీ ఇందులో దట్టించేశారు. ముఖ్యంగా దర్శకేంద్రుల వారి బొడ్డు మీద పళ్ళ దందాని ఇందులోనూ వదల్లేదు. అయినా థియేటర్ కు రావాలంటే ప్రేక్షకులు బలమైన కంటెంట్ ని డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి అవుట్ డేటెడ్ నెరేషన్ తో రిస్క్ చేయడమంటే సాహసమే. సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, సుడిగాలి సుధీర్, బ్రహ్మానందం, భరణి, రఘుబాబు తదితరుల బంగారంలాంటి క్యాస్టింగ్ వృథా అయిపోయింది. అయినా బాలేదనే టాక్ వచ్చిన పెళ్లిసందDకి ఏదో నాలుగు డబ్బులు వచ్చాయని ప్రతిసారి అలాగే వర్కౌట్ అవుతుందనుకుంటే ఎలా?.