ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్మితే పంట పండింది

ఫీల్డ్ ఏదైనా స‌రే.. అంద‌రూ స‌క్సెస్ వెంటే ప‌రుగులు పెడ‌తారు. సినీ రంగం కూడా అందుకు మిన‌హాయింపు కాదు. ఇక్క‌డ స‌క్సెస్ రేట్ మ‌రీ త‌క్కువ కాబ‌ట్టి.. హిట్ కొట్టిన వాళ్లకు ఉండే డిమాండ్ వేరు. ఫ్లాప్ ఇస్తే ప‌రిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమా తేడా కొడితే మార్నింగ్ షో అవ్వ‌గానే ఫోన్ మోగ‌డం ఆగిపోతుంది. అక్క‌డ్నుంచి అవ‌కాశాల కోసం ఎక్కే గ‌డ‌ప దిగే గ‌డ‌ప అన్న‌ట్లుంటుంది ప‌రిస్థితి. అలాంటి వాళ్లను న‌మ్మి అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు అరుదుగా ఉంటారు.

ఐతే ఎవ్వ‌రూ త‌మ‌ను ప‌ట్టించుకోని స్థితిలో త‌మ‌ను న‌మ్మి రాజీ లేకుండా సినిమా నిర్మిస్తే.. ఆ ద‌ర్శ‌కుడిలో ఎంతో క‌సి, త‌ప‌న క‌నిపిస్తాయి. ఎలాగైనా హిట్ కొట్టాల‌ని మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తారు. ఆ క్ర‌మంలో గొప్ప విజ‌యాలు కూడా రావ‌చ్చు. వైజ‌యంతీ మూవీస్ ఇలా ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్మడం ద్వారా వారి కెరీర్ల‌కూ ఊపిరులూద‌డంతో పాటు కాసుల పంట ప‌డించుకుంది.

పిట్ట‌గోడ అనే చిన్న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన అనుదీప్ కేవీని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అందుక్కార‌ణం.. ఆ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నీస ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డ‌మే. ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ద‌ర్శ‌కుడిని వైజ‌యంతీ మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ న‌మ్మి అవ‌కాశం ఇవ్వడం విశేషమే. అందుకు ఫ‌లిత‌మే జాతిరాత్నాలు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్. చాలా త‌క్కువ పెట్టుబ‌డితో భారీ లాభాలు తెచ్చిపెట్టిందీ సినిమా.

ఇక లై, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు లాంటి పెద్ద డిజాస్ట‌ర్లు ఇచ్చిన హ‌ను రాఘ‌వ‌పూడికి ఇంకో ఛాన్స్ ఇచ్చే సాహ‌సం ఎవ్వ‌రూ చేయ‌ర‌నే అనుకున్నారంతా. కానీ అత‌ని విజ‌న్‌ను న‌మ్మి.. కోరుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు, బ‌డ్జెట్ అన్నీ ఇచ్చి సీతారామం సినిమాను నిర్మించింది. ఈ సినిమా క్లాసిక్‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం కూడా సాధిస్తోంది. ఈ చిత్రంతో వైజ‌యంతీ మూవీస్‌కు పేరుకు పేరు, డ‌బ్బుకు డ‌బ్బు వ‌స్తున్నాయి. మొత్తానికి ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ను న‌మ్మి వైజ‌యంతీ సంస్థ గొప్ప ప్ర‌యోజ‌న‌మే పొందింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది టాలీవుడ్లో.