రెండో వారంలో కార్తికేయ విధ్వంస‌మే

మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. జూన్ రెండో వారం నుంచి వ‌రుస‌ డిజాస్ట‌ర్లతో కుదేలైన బాక్సాఫీస్ ఆగ‌స్టు తొలి వారం నుంచి మ‌ళ్లీ బలంగా పుంజుకుంది. తొలి వారంలో రిలీజైన బింబిసార‌, సీతారామం అదిరిపోయే వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్‌కు మ‌ళ్లీ క‌ళ తీసుకొస్తే.. త‌ర్వాతి వారంలో కార్తికేయ అద‌ర‌గొడుతోంది. డీసెంట్ టాక్‌తో మొద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుతాలు చేస్తోంది.

నాలుగు రోజుల‌కే బ్రేక్ ఈవెన్ అవ్వ‌డ‌మే కాదు.. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచింది కార్తికేయ‌-2. వీక్ డేస్‌లో సైతం మంచి ఆక్యుపెన్సీతో న‌డుస్తున్న ఈ చిత్రానికి థియేట‌ర్ల స‌మ‌స్య కొంత ప్ర‌తికూలంగా మారింది. ముందు వారం సినిమాలు బింబిసార‌, సీతారామం రెండో వారంలో కూడా బాగా ఆడుతుండ‌టంతో వాటికి పెద్ద ఎత్తునే థియేట‌ర్లు కేటాయించారు. మ‌రోవైపు నితిన్ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం కూడా పెద్ద సంఖ్య‌లోనే థియేట‌ర్లు చేజిక్కించుకుంది.

ఇక హిందీలో అయితే ఈ సినిమాను నామ‌మాత్రంగా రిలీజ్ చేశారు. కానీ రెండో రోజు నుంచి థియేట‌ర్లు, షోలు పెరుగుతూ పోయాయి. అయినా స‌రే.. సినిమాకున్న డిమాండ్ మేర థియేట‌ర్లు ద‌క్క‌ట్లేదు. ఐతే ఇటు తెలుగు చిత్రాల‌తో పాటు అటు హిందీ సినిమాల‌కు ముందే జ‌రిగిన అగ్రిమెంట్ల మేర వారం రోజుల‌కు థియేట‌ర్లు కేటాయించేశారు. అద్దెల మీద థియేట‌ర్ల‌ను ఇచ్చారు కాబ‌ట్టి ఎగ్జిబిట‌ర్లు వ‌సూళ్ల గురించి ప‌ట్టించుకోరు.

త‌మ సినిమాల‌కు థియేట‌ర్లు తీసుకున్న డిస్ట్రిబ్యూట‌ర్లు ఆశ‌లు చంపుకోకుండా వారం రోజులు ఎదురు చూస్తారు. అందుకే శుక్ర‌వారం వ‌ర‌కు కార్తికేయ‌-2కు నిరీక్షణ త‌ప్ప‌దు. ఈ వారం ఇటు తెలుగులో, అటు హిందీలో అంత ఆస‌క్తిక‌ర చిత్రాలేమీ బ‌రిలో లేవు. బింబిసార‌, సీతారామం అప్ప‌టికి పాత‌బ‌డ‌తాయి. కాబ‌ట్టి శుక్ర‌వారం నుంచి కార్తికేయ‌-2కు పెద్ద సంఖ్య‌లో థియేట‌ర్లు దొరుకుతాయి. ఈ వారానికి ఇండియా వైడ్ ఆ చిత్రం బాక్సాఫీస్ లీడ‌ర్‌గా నిల‌వ‌డం, వ‌సూళ్ల మోత మోగించ‌డం ఖాయం అనే చెప్పొచ్చు.