కార్తికేయ-2.. మరో పుష్ప

‘కార్తికేయ’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో భారీ వ్యూస్ తెచ్చుకుని ఉండొచ్చు కానీ.. ఆ సినిమా గురించి రెగ్యులర్ థియేట్రికల్ ఆడియన్స్‌కైతే పెద్దగా తెలియదు. దానికి కొనసాగింపుగా ఎనిమిదేళ్ల తర్వాత ‘కార్తికేయ-2’ సినిమా తీస్తే దీని గురించి అక్కడి జనాలకు పెద్దగా తెలియలేదు. హిందీలో ప్రమోషన్లు కూడా పెద్దగా ఏమీ చేయలేదు. ఇక రిలీజ్ సంగతి సరేసరి. ఈ చిత్రం రిలీజవుతున్న వారాంతంలోనే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ మూవీ ‘రక్షాబంధన్’ రిలీజవుతుండటంతో ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో థియేటర్లే దొరకలేదు.

ఏదో నామమాత్రంగా చాలా తక్కువ థియేటర్లలో, పరిమిత సంఖ్యలో షోలు వేశారు. ఈ సినిమాను అక్కడ ఏమాత్రం పట్టించుకుంటారులే అనే అంతా అనుకున్నారు. ఇలా ఓ సినిమా రిలీజైనట్లు కూడా తెలియకుండా పోతుందేమో అన్న వాళ్లూ ఉన్నారు. కానీ కట్ చేస్తే.. మొత్తం కథ మారిపోయింది. ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్‌కు తొలి రోజే ఆశ్చర్యకరమైన స్పందన వచ్చింది. హిందూ దేవుళ్లు, పురాణాల గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పడం, దీనికి తోడు ఆసక్తికర కథాకథనాలు తోడవడంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్సినిమా చూసి ఫిదా అయిపోయారు.

రెెండో రోజు నుంచి ఒక్కసారిగా స్క్రీన్లు, షోలు పెరిగిపోయాయి. మూడో రోజు, నాలుగు రోజు అవి మరింతగా మల్టిప్లై అయ్యాయి. అయ్యాయి. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వస్తున్నాయి. సోమవారం ఈ చిత్రానికి హిందీలో మాత్రమే కోటి రూపాయల దాకా గ్రాస్ వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ స్క్రీన్లు తగ్గించి దీనికి కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇంతకుముందు ఇలాగే హిందీలో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అనూహ్యమైన స్పందన తెచ్చుకుని భారీ విజయాన్నందుకుంది పుష్ప. దాని ధాటికి వేరే హిందీ భారీ చిత్రాలు కుదేలయ్యాయి. ‘కార్తికేయ-2’ మరీ దాని స్థాయిలో వసూళ్లు సాధించకపోవచ్చు కానీ.. దీని రేంజికి దినదినాభివృద్ధి చెందుతూ సంచలన కలెక్షన్లు రాబట్టేలా ఉంది. హిందీ వెర్షన్ ఫుల్ రన్ కలెక్షన్లు రూ.10 కోట్ల మార్కును దాటినా ఆశ్చర్యం లేదు. దీని స్థాయికి అది పెద్ద మార్కే అవుతుంది.