విజయ్ సేతుపతికో డిజాస్టర్ తప్పింది

కొన్నిసార్లు పరిస్థితులు సహకరించక వదులుకునే పాత్రలు చివరికి మంచే చేస్తాయని విజయ్ సేతుపతి విషయంలో ఋజువయ్యింది. లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్య చేసిన బోడిపాలెం బాలరాజు క్యారెక్టర్ కు ముందు అనుకున్నది మక్కల్ సెల్వన్ నే. అతను కూడా అమీర్ ఖాన్ అంతటి పెద్ద నటుడి పక్కన వేషమనేసరికి ఎగిరి గంతేశాడు. కానీ వర్క్ షాప్స్ తో పాటు షూటింగ్ కోసమని అడిగిన కాల్ షీట్లు సర్దుబాటు చేయలేనంత బిజీగా అప్పటి కమిట్ మెంట్లు ఉండటంతో ఇష్టం లేకపోయినా వదులుకున్నాడు.

లాల్ సింగ్ బృందం కలిసిన టైంలో విజయ్ సేతుపతి ఉప్పెన, సైరా లాంటి తెలుగు సినిమాలతో పాటు తమిళంలో యమా బిజీగా ఉన్నాడు. ఎలాగూ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లతో కలిసి చేశాను కదా బాలీవుడ్ లోనూ అలాంటి జ్ఞాపకమొకటి ఉండిపోతుందని అనుకున్నాడు. కానీ విధి దానికి సహకరించలేదు. కట్ చేస్తే ఇప్పుడా బాలరాజుగా కనిపించిన చైతుకి ఎలాంటి ప్రయోజనం ఒరగలేదు సరికదా ఇది చేయకపోతేనే బాగుండేదని స్వయానా అభిమానులే ఫీలవుతున్నారు. అంత దెబ్బ కొట్టింది మరి

ఒకవేళ విజయ్ సేతుపతి చేసినా పెద్ద తేడా ఉండేది కాదు కానీ ఆ చడ్డీ బనియన్ కామెడీ ఇతగాడి మీద అంతగా పేలేది కాదేమో. ఏదైతేనేం లాల్ సింగ్ డిజాస్టర్ ఫలితం చూసి హమ్మయ్య అనుకుని ఉంటాడు. ఇక చైతు సంగతి చూస్తే పెద్ద ఫీలవ్వాల్సిన పనేం లేదు. ఎందుకంటే గతంలో నాగార్జున ఇలాంటి క్యామియోలు హిందీలో చాలా చేశాడు. ఒకటి అరా తప్ప అన్నీ పోయాయి. తర్వాత లైట్ తీసుకుని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బ్రహ్మాస్త్ర చేశాడు. సో కెరీర్ ఎదుగుతున్న దశలో నాగచైతన్యకు జరిగే డ్యామేజేమీ లేదనే చెప్పాలి.