ఓటిటి అభిమానులకు ఎన్ని ఆప్షన్లో

జనం థియేటర్లకు రాకపోవడాన్ని ఓటిటిల మీద తోసేయాలని చూసిన కొందరికి ఇటీవలే విడుదలైన బింబిసార, సీతారామంలు  కనువిప్పు కలిగించాయి. ఎంత పెద్ద హీరో అయినా సాధారణంగా ఉండే సోమవారం డ్రాప్ ని సైతం అధిగమించి ఈ రెండూ పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు నమోదు చేయడం సినీ ప్రేమికులను సంతోషంలో ముంచెత్తుతోంది. సరైన కంటెంట్ ఉంటే టికెట్ రేట్లు అసలు సమస్యే కాదని ఆడియన్స్ తేల్చిచెప్పారన్న కోణంలోనూ పలు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ప్రతి వారం సరికొత్త ఓటిటి ఎంటర్ టైన్మెంట్ మాత్రం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.

డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ రామ్ వారియర్ కు డిజిటల్ లో వ్యూస్ భారీగా వచ్చే అవకాశాలున్నాయి.  హాట్ స్టార్ హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 11న దీంతో పాటు నాగ చైతన్య థాంక్ యు ప్రైమ్ ద్వారా నేరుగా ఇంటికొస్తోంది. దీని టాక్ కి భయపడే చాలా మంది హాలుకు వెళ్లే సాహసం చేయలేదు. ఇప్పుడు ఆ కష్టం అవసరం లేదు కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే ఓ లుక్ వేస్తారు. 12న సాయిపల్లవి గార్జి సోనీ లివ్ లో వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మెసేజ్ డ్రామా కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాలేకపోయింది.

ఇక ఆహాలో డబ్బింగుల ప్రవాహం మళ్ళీ మొదలైంది. విజయ్ సేతుపతి మహామనిషి, ఫహద్ ఫాసిల్ మాలిక్ లు అదే రోజు ఒకే సమయంలో వచ్చేస్తాయి. ఇవి కాకుండా హిందీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూసుకుంటే అదో చాంతాడంత లిస్టు అవుతుంది. మొత్తానికి ప్రతి శుక్రవారం థియేట్రికల్ రిలీజులకు ధీటుగా ఓటిటిలు కూడా విపరీతమైన సరికొత్త కంటెంట్ తో పోటీ పడటం చూస్తుంటే జనానికి అసలు ఏది చూడాలో ఏది డ్రాప్ అవ్వాలో అర్థం కానీ అయోమయం నెలకొంటోంది. ఎంత ఇంట్లో చూసే సౌలభ్యం ఉన్నా అన్నీ చూసేంత టైం ఓపిక కావాలిగా.